మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు షాక్.. బీజేపీలోకి అభినవ్ భాస్కర్?

వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే  దాస్యం వినయ్ భాస్కర్ కు అభినవ్ భాస్కర్ షాకిచ్చాడు. వినయ్ భాస్కర్ సోదరుడు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు, 60వ డివిజన్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ ఫిబ్రవరి 8వ తేదీ గురువారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. ఈ సందర్భంగా తన రాజీనామాకు గల కారణాలను లేఖలో తెలిపారు.

 బాబాయ్, మాజీ ఎమ్మెల్యే  దాస్యం వినయ్ భాస్కర్ కోసం చాలా త్యాగాలు చేశామని... అయినా మా బాబాయ్ దగ్గర తమకు గుర్తంపు లేదు అంటూ అభినవ్ భాస్కర్  ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయ్ చుట్టూ ఉండే నలుగురు వ్యక్తుల మాటలు నమ్మి.. తన ఓటమికి  అభినవ్ భాస్కర్ కూడా కారణమని చెప్పడం తనను బాధించిందని.. ఆత్మగౌరవం లేని చోట  తాను ఉండలేనన్నారు.

తన ఓటమికి నైతిక బాధ్యత వహించకుండా తనను నిందించడం సరైన పద్దతి కాదన్నారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు  తెలిపుతున్నట్లు అభినవ్ భాస్కర్ చెప్పారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరబోయేది వెల్లడిస్తానని తెలిపారు. కాగా, అభినవ్ భాస్కర్.. బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.