అందరి నోటా ఆ ఇద్దరి మాటే..

ఈసారి నోబెల్ విజేతల్లో  ఇద్దరి వైపే అందరూ చూశారు. వారిలో ఒకరు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ. మరొకరు అభిజిత్ బెనర్జీ. శాంతి కోసం అబీ అహ్మద్ అలీ తహతహలాడితే, పేదరికం పోవాలంటే ఏం చేయాలా అని అభిజిత్ ఆరాటపడ్డారు. ఆ ఇద్దరి గురించి..

మన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో కు ఈసారి ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ దక్కింది. అభిజిత్ జంటతో పాటు మైఖేల్ క్రెమెర్ కు కూడా ఈ బహుమతి లభించింది. పేదరికాన్నే టార్గెట్ చేసుకుని వీళ్లు పరిశోధనలు  చేశారు. పేదరికం అనేది మాయమైపోవాలంటే ఏం చేయాలనేది వీళ్ల సబ్జెక్ట్.

అబీ అహ్మద్ అలీ, ఆఫ్రికా దేశాలకు తప్ప బయట పెద్దగా వినపడని పేరు. ప్రస్తుతం ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్. ఇథియోపియా అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పేదరికం. అలాంటి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్​కు సెలెక్ట్ అయ్యారు. ఇంతకీ పీస్ ప్రైజ్ దక్కించుకునేంతటి  పనులు ఆయన ఏం చేశారు ?

గరీబీ పై అభి పోరాటం

అభిజిత్ బెనర్జీ – ఎస్తర్ డఫ్లో జంట మొదటి నుంచి పేదరికంపైనే  పోరాటం చేశారు. 1990ల్లో కెన్యాలో  ఈ పోరాటం మొదలైంది. తిండికి కూడా నోచుకోని కొన్ని కుటుంబాలను పైకి తీసుకురావడానికి వీళ్లు తమ తెలివితేటలను ఉపయోగించారు. అభిజిత్ జంట చేసిన ఈ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ తరహా ప్రయోగాలను ఇతర దేశాల్లోనూ అమలు చేశారు. ఇదే ఫైనాన్షియల్ మోడల్ ను ఆ తరువాత మనదేశంలో  కూడా అమలు చేశారు.  ఈ ఎకానమిస్టులు చేసిన కృషి ఫలితంగా లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. వీరి కృషి  ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. గ్లోబ్ పై  ఎక్కడ  పేదరికం ఉంటే అక్కడ వీరి ఆర్థిక మోడల్ అమలైంది. మంచి ఫలితాలనిచ్చింది. ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది.

2003 లో  జే – పాల్ ఏర్పాటు

పేదవాళ్ల పై అభిజిత్, ఎస్తర్ డఫ్లోకు  మొదటి నుంచి జాలి, దయ ఉండేవి.బాగా పేదరికంలో మగ్గుతున్న వారికి తమ వంతు ప్రయత్నంగా సాయం అందించాలని వీరిద్దరూ డిసైడ్ అయ్యారు. పేదవారికి మేలు చేయడానికి  వివిధ మార్కెట్లు,  సంస్థలు ఎలా పనిచేస్తున్నాయన్న విషయం స్టడీ చేయడానికి 2003 లో ‘అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే– పాల్) ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇండియా, ఆఫ్రికా లో కొన్ని కుటుంబాలను నమూనాగా తీసుకున్నారు. పేదవారికి ఎక్కడెక్కడ సాయం అందాల్సిన అవసరం ఉందో ఈ ఫీల్డ్ స్టడీ తరువాత వారిద్దరూ ఒక అంచనాకు వచ్చారు.

ముఖ్యంగా పేదవారి తిండి విషయంలో  డిటైల్డ్ గా ఫీల్డ్ వర్క్ చేశారు. దీని కోసం 18 దేశాల నుంచి డేటా తెప్పించుకున్నారు. ఈ డేటా ఆధారంగా అభిజిత్ ప్రతిపాదించిన సూత్రాలను అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఓ నమూనాగా తీసుకున్నాయి. పేదవారి కోసం అమలు చేస్తున్న ఫుడ్ పాలసీలో మార్పులు తీసుకువచ్చాయి. న్యూట్రిషియస్ ఫుడ్ కు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని డిసైడయ్యాయి.

ఢిల్లీ స్కూల్స్ పై అభిజిత్ ప్రభావం

ఢిల్లీ స్కూల్స్ పై  అభిజిత్ ప్రభావం బాగా ఉంది. ఈ స్కూల్స్ లో అనేక రకాల సంస్కరణలు తీసుకురావడానికి ఆయన ప్రయత్నించారు. పేదరిక నిర్మూలన అంటే మాటలు కాదంటారు అభిజిత్, ఎస్తర్ డఫ్లో. దీనికి పక్కా  ప్లానింగ్ ఉండాలంటారు. మేజిక్ తో ప్రపంచంలో ఎక్కడా పేదరికం పోదంటారు.

నోబెల్ ప్రైజ్ పంచుకున్న  మైఖేల్ క్రెమెర్

అభిజిత్ జంటతో పాటు మరో ఆర్థిక నిపుణుడు మైఖేల్ క్రెమెర్ కు కూడా నోబెల్ ప్రైజ్ దక్కింది. ఈ ముగ్గురికి కలిపి బహుమతి ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 10న స్టాక్ హోం లో ఈ ముగ్గురికీ  నోబెల్ బహుమతి అందచేస్తారు.

అభిజిత్, ఎస్తర్ డఫ్లే డెవలప్ మెంట్ మోడల్ ఏంటి ?

సమాజం నుంచి పేదరికాన్ని మాయం చేయడానికి ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రకటిస్తుంటాయి. ఇవన్నీ కాగితాల మీద చాలా అందంగా ఉంటాయి. ఈ పథకాలు రూట్ లెవెల్లో ఎలా అమలవుతున్నాయనేది ఎవరూ పట్టించుకోరు. అభిజిత్ జంట ఇక్కడే దృష్టి పెట్టింది. ప్రభుత్వ పాలసీలు రూట్ లెవెల్లో అమలవుతున్న తీరును డిటైల్డ్ గా పరిశీలించారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్ వంటి అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా స్టడీ చేశారు. ఏఏ పాలసీలకు పేద ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే అంశంపై  రీసెర్చ్ చేశారు. ప్రభుత్వ పాలసీల్లో లోపాలను, చేయాల్సిన మార్పులను స్టడీ చేశారు. ఉదాహరణకు పేద వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు. కొంతమంది ఇలా పేదవర్గాలకు రాయితీలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అయితే రాయితీలు ఇవ్వడం వల్ల  పేదవర్గాలకు జరిగే మేలు ను అభిజిత్, ఎస్తర్ గుర్తించారు.  దీని ఆధారంగా తమ మార్క్  ఎకనమిక్ మోడల్ ను తయారు చేశారు. ఇదే తరువాత డెవలప్ మెంట్ ఎకనమిక్స్ లో భాగంగా మారింది.

అమర్త్య సేన్ తరువాత ..

భారత మూలాలున్నవారిలో ఎకనమిక్స్ నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న  రెండో వాడిగా అభిజిత్ బెనర్జీ నిలిచారు. అమర్త్య సేన్ కు 1998లో  నోబెల్ ఆర్థిక బహుమతి దక్కింది. వీరిద్దరూ బెంగాలీలు కావడం  విశేషం.

శాంతి కోసం అబీ ఆరాటం

నోబెల్ బహుమతుల్లో  శాంతి బహుమతికి ఒక ప్రత్యేకత ఉంది.  ప్రపంచ శాంతి కోసం పనిచేసిన వారికి స్పెషల్ గా ఓ ప్రైజ్ ఇవ్వాలని ఆల్ ఫ్రెడ్ నోబ్ తన వీలునామాలో రాశారు. దీని ఫలితమే నోబెల్ శాంతి బహుమతి. ఆఫ్రికా లో శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా అబీ అహ్మద్ కు శాంతి బహుమతి దక్కింది.

ఎరిట్రియాతో శాంతి కోసం చొరవ

అబీ అహ్మద్ అలీ కిందటేడాది ఏప్రిల్ 2న ఇథియోపియా ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. అప్పటికే పొరుగుదేశమైన ఎరిట్రియాతో ఇథియోపియాకు గొడవలున్నాయి. ఈ గొడవలకు 20 ఏళ్ల చరిత్ర ఉంది. గొడవలు కూడా అలా ఇలా కాదు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి స్థాయిలో ఉన్నాయి. ఓ సరిహద్దు గొడవ రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచింది.1998 నుంచి 2000 మధ్య యుద్ధం జరిగింది. చివరకు రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇథియోపియా అబీ ప్రధాని అయ్యారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని వారాల్లోనే  శాంతి చర్చల కోసం ఎరిట్రియా ప్రెసిడెంట్ ఆఫ్వెర్కీతో చర్చలు జరిపారు. ఎరిట్రియాతో సంబంధాలు మళ్లీ చక్కబడేలా చూశారు. రెండు దేశాల మధ్య విమానాలు తిరిగేలా  చర్యలు తీసుకున్నారు.

వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం

ఎరిట్రియాతోనే కాదు. మరో పొరుగుదేశమైన జిబౌటీతోనూ ఇథియోపియాకు గొడవలున్నాయి. ఈ గొడవలకు కూడా ఫుల్ స్టాప్ పడేలా ఆ దేశ నాయకులతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారు అబీ అహ్మద్ అలీ. జిబౌటీతో  పోర్టుకు సంబంధించిన అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. ఇదొక్కటే కాదు, కొన్ని అంతర్జాతీయ వివాదాల  పరిష్కారంలో కూడా ఆయన మేజర్ రోల్ పోషించారు. అప్పటికే కెన్యా, సోమాలియా దేశాల మధ్య తగాదాలున్నాయి. ఈ తగాదాలకు ఫుల్ స్టాప్ పడేలా చేయడంలో అబీ అహ్మద్ అలీ ఓ మధ్యవర్తిగా అలుపెరుగని కృషి చేశారు. ఇదంతా కొన్ని నెలల్లోనే.

పీఎం అయిన వంద రోజుల్లోనే ..

అబీ అహ్మద్ అలీ ప్రధాని అయ్యేనాటికి దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది. మీడియాపై సెన్సార్ షిప్ ఉంది. ఆయన వెంటనే ఎమర్జెన్సీ ఎత్తేశారు. జైళ్లలో ఉన్న అసమ్మతివాదులను  విడుదల చేశారు. మీడియాపై సెన్సార్ షిప్ ను ఎత్తేశారు. అవినీతి అధికారులను తొలగించారు. ఎకానమీ లో మార్పులు తెచ్చారు. దేశాన్ని ఫైనాన్షియల్ గా గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. కేబినెట్ లో ఆడవారికి ప్రాతినిధ్యం పెంచారు. సహ్లే వర్క్ జెవ్ దే ను దేశానికి తొలి మహిళా  ప్రెసిడెంట్ చేశారు. ఇవన్నీ చేయడానికి పెద్ద టైమ్ తీసుకోలే. అధికారానికి వచ్చిన వంద రోజుల్లోనే అబీ అహ్మద్ అలీ ఇవి సాధించారు.

అతి తక్కువ వయసుకే ప్రధాని పదవి

ఆఫ్రికాలోనే తక్కువ వయసున్న (43) లీడర్  అబీ అహ్మద్ అలీ. ఆయన 1976 ఆగస్టు 15న పుట్టారు. తండ్రి ముస్లిం. తల్లి  క్రిస్టియన్. 1991 లో సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. 1993లో ఇథియోపియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ లో చేరారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా అనేక హోదాల్లో పనిచేశారు. సైన్యంలో లెఫ్టినెంట్  కల్నల్ స్థాయి వరకు ఆయన వెళ్లారు. 1995లో రువాండాలో ‘యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్’లో లో డ్యూటీ చేశారు. 2008లో కొంతమంది  ఫ్రెండ్స్ తో కలిసి ‘ఇథియోపియన్ ఇన్ ఫర్మేషన్ నెట్ వర్క్  సెక్యూరిటీ ఏజెన్సీ’ ను ఏర్పాటు చేశారు. ఇవే కాదు, చదువులోనూ అబీ అహ్మద్ అలీ సత్తా చాటారు. ఇంజనీరింగ్ లో డిగ్రీ చేశారు. ఆ తరువాత ఎంబీఏ చేశారు. 2017 లో అడీస్  అబాబా యూనివర్శిటీ నుంచి పీహెచ్. డీ చేశారు.

2010లో  ఎంపీగా ఎన్నిక

సైన్యం నుంచి బయటికొచ్చాక ‘ఒరోమో డెమొక్రటిక్ పార్టీ ’ ( ఓడీపీ) తో అబీ అహ్మద్ అలీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా త్వరగా పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఎన్నికయ్యారు. 2010 లో ఓడీపీ తరఫున ఇథియోపియన్ ఫెడరల్ పార్లమెంటరీ అసెంబ్లీ కి  ఎన్నికయ్యారు. అప్పటికి దేశంలో కొన్ని ప్రాంతాల్లో క్రిస్టియన్లు, ముస్లింల మధ్య  గొడవలు ఉండేవి. దీని ఫలితంగా కొన్నిసార్లు హింస చెలరేగేది. లా అండ్ ఆర్డర్  ప్రాబ్లమ్ వచ్చేది. ఈ పరిస్థితుల్లో అబీ అహ్మద్ అలీ రెండు కమ్యూనిటీలకు చెందిన పెద్దలతో మాట్లాడి గొడవలు సద్దుమణిగేలా చేశారు. ‘రిలీజియస్ ఫోరం ఫర్ పీస్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇథియోపియాలో శాంతి కోసం కృషి చేశారు.  2015 నాటికి ‘ఒరోమో డెమొక్రటిక్ పార్టీ ’ లో ప్రముఖుడయ్యారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో అబీ అహ్మద్ అలీ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.

కత్తి మీద సాములా మారిన ఎంపిక

ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ కోసం పెద్ద పోటీ జరిగింది. వందల సంఖ్యలో వ్యక్తులు, పదుల సంఖ్యలో సంస్థలు పోటీ పడ్డాయి. వీరిలో నుంచి ఒకరిని ఎంపిక చేయడం నోబెల్ కమిటీకి కత్తి మీద సాములా మారింది. చివరకు  ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఏడాదిలోనే ఇథియోపియాలో అనేక మార్పులకు కారణమై, కొన్ని అంతర్జాతీయ గొడవలను సద్దుమణిగింప చేయడంలో అబీ చేసిన అలుపెరుగని కృషి ని మెచ్చి పీస్ ప్రైజ్  ప్రకటించింది.

మొక్కలు నాటడంలో రికార్డు

పొరుగుదేశాలతో ఫ్రెండ్ షిప్, ఎకానమీని చక్కదిద్దుకోవడం ఇవే కాదు మొక్కలు పెంచడమన్నా అబీ అహ్మద్ అలీకి చాలా ఇష్టం. ఆయన ప్రధాని అయ్యాక లేటెస్ట్ గా ఇథియోపియా మొక్కలు నాటడంలో  ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది.వెయ్యో, లక్షో కాదు ఏకంగా 35 కోట్లకు పైగా మొక్కలు నాటింది.అది కూడా  కేవలం 12 గంటల్లో.  మొక్కలు నాటే కార్యక్రమానికి  ఇథియోపియా చాలా కాలం నుంచి టాప్ ప్రయారిటీ ఇస్తోంది.అబీ అహ్మద్ అలీ హయాంలో ఇది జోరందుకుంది.  సహజంగా మొక్కలు నాటడానికి వానాకాలం అనువుగా ఉంటుంది.  దీంతో వానాకాలాన్ని ఊరికే పోనివ్వరాదని ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ డిసైడ్ అయ్యారు.  ‘గ్రీన్ లెగసీ ’ పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలంటూ ఈ ఏడాది జులైలో ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఇథియోపియా ప్రజలు కదిలారు.  కేవలం ఆరు గంటల్లో 15 కోట్ల మొక్కలు నాటారు. లెక్కలు తీస్తే మొత్తం 35 కోట్ల పైచిలుకు మొక్కలు నాటారు.