![రెండో పెండ్లి చేస్కుంటానని వేధిస్తున్నడు](https://static.v6velugu.com/uploads/2025/02/abids-detective-inspector-narasimhas-wife-sandhya-has-alleged-that-he-is-harassing-me-for-extra-dowry_CGOjeH36Fh.jpg)
- మగ బిడ్డ కోసం మూడు సార్లు అబార్షన్ చేయించాడు
- అబిడ్స్ డీఐపై భార్య సంధ్య ఫిర్యాదు
బషీర్ బాగ్, వెలుగు : అబిడ్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్నరసింహ అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడని ఆయన భార్య సంధ్య ఆరోపించింది. శనివారం సిటీ సీపీని కలిసి ఫిర్యాదు చేసింది. ‘2012లో నాకు, నరసింహకు వివాహమైంది. ఆ సమయంలో నరసింహ ఎస్సై. మాకు మొదటగా పాప పుట్టింది. అప్పుడే నా భర్త అదనపు కట్నం డిమాండ్ చేశాడు. చేసేదేం లేక నా తల్లిదండ్రులు లక్షన్నర క్యాష్, తులం బంగారం ఇచ్చారు.
మగబిడ్డ కోసం నరసింహ నాకు మూడు సార్లు అబార్షన్ చేయించాడు. బాబు కావాల్సిందేనని మానసికంగా, శారీరకంగా వేధించాడు. ఇటీవల ఇన్స్పెక్టర్గా ప్రమోషన్పొందాడు. అప్పటి నుంచి నన్ను, నా పదేండ్ల కూతురు, ఐదేండ్ల కొడుకును వదిలేసి దూరంగా ఉంటున్నాడు. రెండో పెండ్లి చేసుకుంటున్నానని వేధిస్తున్నాడు. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలి’ అని సంధ్య సీపీని కోరింది.
ఆరోపణలన్నీ అవాస్తవం : డీఐ
తనపై సంధ్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని అబిడ్స్ డీఐ నరసింహ తెలిపారు. 3సార్లు అబార్షన్ చేయించాననడం అబద్ధమని, అదనపు కట్నం అంశమే తమ మధ్య లేదన్నారు. ఆమె ప్రవర్తన బాగోలేదని మందలించానని, ఎలాంటి మార్పు లేకపోవడంతో ఎల్బీనగర్ కోర్టులో విడాకులకు అప్లయ్ చేశానన్నారు. అప్పటి నుంచి తాను వేరుగా ఉంటున్నామని తెలిపారు.