హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల డిప్యూటేషన్లు రద్దు

హాస్టల్  వెల్ఫేర్  ఆఫీసర్ల డిప్యూటేషన్లు రద్దు
  • హాస్టల్  వెల్ఫేర్  ఆఫీసర్ల డిప్యూటేషన్లు రద్దు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఐటీడీఏ పీవో
  • చార్జీ ఇవ్వకుండా ఆఫీసర్ల చుట్టూ హెచ్​డబ్ల్యూవోల చక్కర్లు
  • ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్లు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టళ్లలో పని చేస్తున్న 36 మంది హాస్టల్  వెల్ఫేర్  ఆఫీసర్ల డిప్యూటేషన్లు రద్దు చేస్తూ పీవో గౌతమ్ పోట్రు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వారికి వ్యక్తిగతంగా ఆర్డర్లు పంపించినా వారు రిలీవ్​ కావడం లేదు. దీంతో ఆయా హాస్టళ్లలో గందరగోళం నెలకొంది. ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్​ అయిన హాస్టళ్లలో హెచ్ఎంలు ఎఫ్ఏసీగా చార్జీ తీసుకోవాలని, ఆర్డరు వచ్చిన వెంటనే అసలు పోస్టు ఉన్న చోట హెచ్​డబ్ల్యూవోలు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు డిప్యూటేషన్​పై పని చేసిన హాస్టల్​ వెల్ఫేర్​ ఆఫీసర్లు చార్జ్​ అప్పగించకుండా, హాస్టళ్లకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో హాస్టళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

డిప్యూటేషన్లలో కొనసాగేందుకు..

డిప్యూటేషన్లలో కొనసాగేందుకు పలువురు హాస్టల్  వెల్ఫేర్  ఆఫీసర్లు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. పీవో  ఇచ్చిన ఆర్డర్​ను బేఖాతర్ చేస్తూ నేటికీ చార్జీ అప్పగించకుండా, హాస్టళ్ల వంక చూడకుండా తిరుగుతున్నారు. కొన్ని చోట్ల హెచ్ డబ్ల్యువోలు గుట్టుగా డ్యూటీలు చేస్తున్నారు. అటెండెన్స్​ రిజిస్టర్లు, స్టోర్ రూం తాళాలు వారి వద్దనే ఉన్నాయి. భద్రాచలం కన్వర్టెడ్  ఆశ్రమ స్కూలులో శనివారం గ్యాస్, కట్టెలు  అయిపోయాయని కుక్​లు వాపోయారు. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు వెంటనే గ్యాస్ తెప్పించారు. మరోవైపు డిప్యూటేషన్​ రద్దు అయిన వారంతా ఐటీడీఏ పీవోను కలిసి ఉత్తర్వులు నిలిపి వేయాలని కోరుతున్నారు. అకడమిక్  ఇయర్ మధ్యలో ఈ నిర్ణయం తమకు ఇబ్బంది కలిగిస్తుందని అంటున్నారు. అయితే పీవో మాత్రం అడ్మినిస్ట్రేషన్  గ్రౌండ్ లో ఆర్డర్ ను తప్పనిసరిగా ఆమోదించాలని స్పష్టం చేస్తున్నారు. కాగా కొందరు రాజకీయంగా ఒత్తిడి తెస్తున్నట్లు విమర్శలున్నాయి. డీడీ సెక్షన్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. జనవరి 1 నుంచి రిలీవ్ కావాల్సిందేనని ఐటీడీఏ నుంచి ఆదేశాలు వచ్చాయి. డిసెంబర్​23న ఆర్డర్స్ వచ్చినా క్రిస్మస్  సెలవులు, బాక్సింగ్ డే, రాష్ట్రపతి పర్యటన కారణంగా 30 వరకు ఆర్డర్స్  అందలేదని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆర్డర్ అందిన వెంటనే రిలీవ్  కావాల్సి ఉన్నా, వారం దాటినా డిప్యూటేషన్  రద్దు ఉత్తర్వులను పట్టించుకోకుండా, హాస్టళ్లకు పోకుండా కాలయాపన చేస్తున్నారని అంటున్నారు.

వర్గపోరు కారణంగానే..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు గిరిజన ఆశ్రమ, సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్లు, హెచ్ఎంల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వీరి కొట్లాట కారణంగా గిరిజన సంక్షేమశాఖ పరువు బజారుకెక్కుతోందని అంటున్నారు. అంతర్గత పోరుతో స్టూడెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగానే ఐటీడీఏ పీవో డిప్యూటేషన్లను రద్దు చేసినట్లు 
చెబుతున్నారు.

రిలీవ్ కావాల్సిందే..

డిప్యూటేషన్ రద్దు అయిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు రిలీవ్ కావాల్సిందే. పీవో ఇచ్చిన ఆర్డర్ అమలు చేస్తాం. ఆర్డర్ పై అభ్యంతరాలు తెలిపేందుకు ఐటీడీఏకు వాళ్లు వచ్చారు. అయినా ఆర్డర్స్​ క్యాన్సిల్​ చేసే అవకాశం లేదు. ఆర్డర్ అందుకున్న వారంతా తమ ప్లేస్​కు వెళ్లిపోవాలి.
- రమాదేవి, డీడీ, ఐటీడీఏ