టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తాజాగా తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ స్టే కొనసాగుతోందని స్పష్టం చేసింది. కాగా.. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారని ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా యాక్షన్ తీసుకుంది. శనివారం ఉదయం 7 గంటల నుండి దాదాపు మూడు గంటల పాటు హైడ్రా అధికారులు, సిబ్బంది కలిసి ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు. అయితే, ఈ కూల్చివేతలను సవాల్ చేస్తూ నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మధ్యంతర స్టే విధించింది.
కాగా అంతకుముందు.. హైడ్రా కూల్చివేతలపై ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సైతం నాగార్జున స్పందించారు. ఎన్ కన్వెన్షన్ నిర్మించింది పూర్తి గా పట్టా భూమి అని.. ఒక్క అంగుళం కూడా ఎఫ్టీఎల్ అక్రమణకు గురి కాలేదని తెలిపారు. కూల్చివేత ముందుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను నేలమట్టం బాధకరమని అన్నారు. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. తప్పుడు సమాచారంతోనే కూల్చివేత జరిగిందన్న నాగ్.. ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. చట్టాలను గౌరవించే వ్యక్తిగా న్యాయస్థానాలపై నమ్మకం ఉందని.. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
ALSO READ | సీఎం రేవంత్కు మంత్రి కోమటిరెడ్డి లేఖ..N కన్వెన్షన్పై హైడ్రా కొరడా
కాగా, మాదాపూర్ ఎన్ కన్వెన్షన్లో అక్రమ కట్టడాలను ఆగస్టు 24న ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నాన్ స్టాప్ గా హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. మొత్తం 6 భారీ మిషన్లు, జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు, సిబ్బంది. మాదాపూర్ లోని తుమ్మిడి చెరువు భూమిని ఆక్రమించి.. నాగార్జున N కన్వెన్షన్ నిర్మించారు. చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో హైడ్రా చర్యలు తీసుకుంటోంది. మొత్తం 10 ఎకరాల విస్తీరణంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించగా.. ఇందులో మూడున్నర ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా కూల్చివేత చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు కొనసాగాయి.