నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లలో.. పెయిడ్​ పార్కింగ్ ఎత్తివేత

నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లలో.. పెయిడ్​ పార్కింగ్ ఎత్తివేత
  • ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన అధికారులు
  • పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ప్యాసింజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రో అధికారులు వెనక్కి తగ్గారు. నాగోలు, మియాపూర్​మెట్రో స్టేషన్లలో ‘పెయిడ్ పార్కింగ్’ అమలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పెయిడ్​పార్కింగ్​అంశంపై ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి నుంచి నాగోలు మెట్రో స్టేషన్ లో, సెప్టెంబర్1 నుంచి పెయిడ్ పార్కింగ్​అమలు చేస్తున్నట్లు ఎల్ అండ్​టీ గతంలో ప్రకటించింది. 

14న  నాగోలు మెట్రో స్టేషన్​వద్ద ‘పైలట్ రన్’ కూడా నిర్వహించింది. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇన్నాళ్లు ఫ్రీ పార్కింగ్ కల్పించి, ఉన్నపళంగా ఎత్తేయడం ఏమిటని మెట్రో అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లో పార్కింగ్​ఏర్పాటు చేసి, ఫీజు వసూలు చేయడం ఏమిటని మండిపడ్డారు. వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు మెట్రో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రోగ్రెస్సివ్ యూత్​లీగ్ సంస్థ ఆదివారం నాగోలు మెట్రో వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఎల్ అండ్ టీ అధికారులు పెయిడ్​ పార్కింగ్​ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శనివారం ప్రకటన విడుదల చేశారు.

అన్ని స్టేషన్లలో ఎత్తేయాలి

సిటీలోని అన్ని మెట్రో స్టేషన్లలో పెయిడ్​పార్కింగ్ ను ఎత్తివేయాలని ప్రోగ్రెస్సివ్​యూత్​లీగ్ అధ్యక్షుడు కేఎస్ ప్రదీప్ డిమాండ్​చేశారు. అన్నిచోట్ల ప్రభుత్వ భూముల్లోనే పార్కింగ్​ఏర్పాటు చేశారని, అలాంటప్పుడు ప్రయాణికులు ఎందుకు చార్జీలు చెల్లించాలని ప్రశ్నించారు. సినిమా థియేటర్లు, షాపింగ్​మాల్స్​లో పార్కింగ్​ఫీజు వసూలు చేయొద్దనే నిబంధనలు ఉన్నాయని, మెట్రో స్టేషన్లలోనూ అమలు చేయాలని కోరారు. మెట్రో జర్నీ చేసేందుకు టికెట్​తీసుకుంటున్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా పార్కింగ్​ఫీజు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. ఇప్పటికే అధిక చార్జీలతో ప్రయాణికుల జేబులకు చిల్లుపడుతోందని, ఇప్పుడు పార్కింగ్ పేరుతో అదనపు వసూలు చేయాలని అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. పెయిడ్​పార్కింగ్​అమలు చేస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

చార్జీల పట్టిక తొలగింపు

నాగోలు మెట్రో స్టేషన్​లో ఏర్పాటు చేసిన పెయిడ్​పార్కింగ్​చార్జీల వివరాలను తొలగించారు. ఈ నెల 14న పైలట్​రన్​లో భాగంగా ఏర్పాటు చేసిన చార్జీల వివరాల స్టిక్కర్లను చించేశారు. అయితే నాగోలు, మియాపూర్​ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసి, మెరుగైన పార్కింగ్​సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని మెట్రో అధికారులు గతంలో ప్రకటించారు. పార్కింగ్​ ఏరియాలో మెరుగైన లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, బయో టాయిలెట్స్​నిర్మిస్తామని చెప్పారు. తాజాగా పెయిడ్​పార్కింగ్​నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.