- ఈ హక్కును రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశం ఇదే
- హక్కుల కార్యకర్తల సంబురాలు
పారిస్: ఫ్రాన్స్‌లో అబార్షన్ ఇకపై రాజ్యాంగబద్ధమైన హక్కుగా అమలులోకి రానుంది. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు సోమవారం పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపాయి. బిల్లుకు అనుకూలంగా 780 మంది ఎంపీలు, సెనేటర్లు ఓటు వేయగా, వ్యతిరేకంగా 72 మంది ఓటేశారు. దీంతో అబార్షన్ ను రాజ్యాంగ హక్కుగా చేర్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన వెంటనే పారిస్ లోని ఐఫిల్ టవర్ వద్ద హక్కుల కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ‘‘మై బాడీ మై చాయిస్” అనే నినాదాన్ని ఈఫిల్ టవర్‌పై డిస్ ప్లే చేశారు. ఫ్రాన్స్‌లో 1974 నుంచే అబార్షన్ చట్టబద్ధమైన హక్కుగా ఉంది. అప్పట్లోనే ఈ హక్కుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
వెల్లువెత్తిన విమర్శలు..
ఫ్రాన్స్‌లో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చే బిల్లు పాస్ కావడంతో ఫెమినిస్టులు, ఇతర హక్కుల సంఘాల కార్యకర్తలు హర్షం ప్రకటించగా.. యాంటీ అబార్షన్ గ్రూపుల వాళ్లు, వాటికన్, రోమన్ క్యాథలిక్ బిషప్‌లు మాత్రం తీవ్రంగా విమర్శించారు. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రన్ రాజకీయ లబ్ధి కోసమే ఈ బిల్లును పాస్ చేయించారని మెరైన్ లీ పెన్ అనే నాయకురాలు ఫైర్ అయ్యారు. వాటికన్ సిటీ, ఫ్రెంచ్ క్యాథలిక్ బిషప్ వర్గాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన జారీ చేశాయి. ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశాయి.