- కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని ఒక ఆస్పత్రి ఓపెన్
- యథావిధిగా ఆపరేషన్లకు తెగబడుతున్న నిర్వాహకులు
- మరో నాలుగు ఆస్పత్రుల్లోనూ గర్భస్రావాలు
- తెల్లవారుజామున 4 నుంచి 7 గంటల లోపు ఆపరేషన్లు క్లోజ్
- అబార్షన్లపై ఎలాంటి ఫిర్యాదులు లేవంటున్న ఆఫీసర్లు
‘‘తిరుమలాయపాలెం మండలం బచ్చోడు తండాకు చెందిన ఒక మహిళ(28)కు ఇప్పటికే ఒక కుమార్తె ఉంది. ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆర్ఎంపీ ద్వారా సీక్రెట్ గా స్కానింగ్ చేయించగా గర్భంలో ఉన్నది కూడా పాప అని తేలింది. దీంతో అదే ఆర్ఎంపీ ద్వారా ఆదిత్య థియేటర్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో గత శనివారం తెల్లవారుజామున అబార్షన్ చేయించారు. ఆస్పత్రి యాజమాన్యం ముందుగా రూ.35 వేలు డిమాండ్ చేయగా, రూ.25 వేలు తీసుకొని అబార్షన్ చేశారు’’
ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాలో మళ్లీ అబార్షన్ల దందా జోరందుకుంది. వైద్యారోగ్య శాఖ అధికారుల తనిఖీలతో నాలుగైదు నెలల కింద కొంత సైలెంట్ అయిన ఆస్పత్రుల యాజమాన్యాలు, తిరిగి తమ పనిని మొదలుపెట్టాయి. ఎవరికీ అనుమానం రాకుండా తెల్లవారు జామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోపే పని ముగించేస్తున్నాయి. నగరంలోని నాలుగైదు ఆస్పత్రుల్లో ఎక్కువగా గర్భస్రావాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం అబార్షన్లపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెబుతున్నారు.
ఇదీ పరిస్థితి...
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో నాలుగైదు నెలల కింద జిల్లా అధికారులు వరుస దాడులు చేశారు. జిల్లాలో స్కానింగ్ ద్వారా పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అని తెలుసుకొని విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు కదిలారు. స్కానింగ్ లు నిర్వహిస్తున్న 10 మందికి పైగా ఆర్ఎంపీలను పట్టుకోవడంతో పాటు, అనుమతి లేకుండా అబార్షన్లు చేస్తున్న ఆస్పత్రులపైనా చర్యలు తీసుకున్నారు. ఖమ్మం నగరంలోనే నాలుగు నెలల కింద ఆరు ఆస్పత్రులను అధికారులు సీజ్ చేశారు. ఇందులో మూడు ఆస్పత్రుల్లో అబార్షన్లు జరుగుతున్నట్టుగా గుర్తించారు.
ఎంటీపీ (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) పర్మిషన్లు లేకుండానే అబార్షన్లు చేయడంపై ఆఫీసర్లు సీరియస్ అయ్యారు. ఆయా ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక ఆస్పత్రిలో అబార్షన్లు నిర్వహిస్తున్న సమయంలో రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే రోజు ఆ ఆస్పత్రిలో ఎనిమిది అబార్షన్లు జరిగినట్టుగా తేల్చారు. పేషెంట్లకు సంబంధించిన కేస్ షీట్లు సరిగా లేకపోవడంతో పాటు, ఒక్క నెలలోనే 100కు పైగా అబార్షన్లు చేశారని తేలడంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులు కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మళ్లీ అబార్షన్లు చేయబోమనే కండిషన్ పై తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్టు సమాచారం. కానీ, తిరిగి ఆ ఆస్పత్రిలో అబార్షన్లు ప్రారంభించారు. ఎవరికీ అనుమానం రాకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోనే అబార్షన్లు చేసి పంపిస్తున్నట్టు
తెలుస్తోంది.
తూతూ మంత్రం తనిఖీలు!
ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న అవకతవకలు, తప్పులపై ఎప్పటికప్పుడు నజర్ పెట్టాల్సిన ఆఫీసర్లు మాత్రం అబార్షన్ల సంగతి తమ దృష్టికి రాలేదంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు, లేదా తీవ్ర స్థాయిలో కంప్లైంట్లు వచ్చినప్పుడు మాత్రమే తూతూ మంత్రం తనిఖీలు చేస్తూ మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబార్షన్లు జరుగుతున్నాయని ఫిర్యాదులు ఉన్న ఆస్పత్రికి ఇటీవల వైద్యారోగ్య శాఖ అధికారులు వెళ్లినా, రొటీన్ గానే తనిఖీ చేశాం తప్పించి అక్కడ ఎలాంటి తప్పులను గుర్తించలేదని చెప్పడంపై అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
ఎక్కువగా ఇక్కడే..
ఖమ్మం నగరంలో సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు అత్యంత సమీపంలోని ఒక ఆస్పత్రితో పాటు, ఆదిత్య థియేటర్ రూట్లో ఉన్న ఒక ఆస్పత్రిలో ఒకరే మహిళా డాక్టర్ అబార్షన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్డీవో ఆఫీస్ సమీపంలో ఉన్న ఒక ఆస్పత్రిలో, నెహ్రూ నగర్ లో ఉన్న మరో ఆస్పత్రిలోనూ అబార్షన్లు జరుగుతున్నట్టు సమాచారం. ఒక ఆస్పత్రిలోని సెల్లార్ లో సీక్రెట్ గా అబార్షన్లు చేయడంతో పాటు, ఆస్పత్రిని ఆనుకొని ఉన్న మరో భవనంలో ఒక రూమ్ తీసుకొని, ఆపరేషన్ తర్వాత పేషెంట్లను ఎవరికీ అనుమానం రాకుండా ఆ గదికి
తరలిస్తున్నారు.