- ఒక్క రోజే 33 మంది మృతి.. 7,432 కొత్త కేసులు
- జిల్లాల్లో వచ్చినవే 5,968
- హాస్పిటళ్లలో ఉన్నోళ్లలో 80% మంది కండీషన్ సీరియస్
- టెస్టులు, ట్రీట్మెంట్పై చేతులెత్తేసిన సర్కార్
- లక్షణాలుంటే కరోనా ఉన్నట్లే అనుకోవాలంటూ ఆర్డర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. వందల మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఫస్ట్ వేవ్‌లో గ్రేటర్ హైదరాబాద్‌ను వణికించిన కరోనా.. ఇప్పుడు జిల్లాలను చుట్టేస్తోంది. ప్రతి పల్లెలోకి మహమ్మారి చొచ్చుకుపోయింది. ఫస్ట్ వేవ్‌లో 20 శాతం కేసులు రూరల్‌లో, 80 శాతం కేసులు అర్బన్ ఏరియాల్లో రాగా, ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. 20 శాతం కేసులు అర్బన్‌లో వస్తే, 80 శాతం జిల్లాల్లో నమోదవుతున్నాయి. శుక్రవారం నమోదైన 7,432 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో 1,464, జిల్లాల్లో 5,968 ఉన్నాయి. 33 మంది చనిపోయినట్టు హెల్త్ డిపార్ట్ మెంట్ శనివారం ప్రకటించింది. అయితే అనధికారికంగా ఈ మృతుల సంఖ్య వందకుపైగా ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో మరణాలు నమోదైనట్లు సర్కారు ప్రకటించడం ఇదే తొలిసారి. గత ఐదు రోజుల్లోనే 123 మంది కరోనాకు బలయ్యారు.
లెక్కల్లో తేడాలు..
గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్‌నగర్, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఆయా జిల్లాల్లో టెస్టు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో సగటున 20 మందికి పాజిటివ్ వస్తోంది. నిజామాబాద్‌లో గడిచిన వారం రోజుల్లోనే 2,857 కేసులు నమోదైనట్టు బులిటెన్ లెక్కలు చెబుతుండగా, అసలు లెక్క ఇంతకు ఐదు రెట్లు ఉందని ఆ జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. గడిచిన వారం రోజుల్లో మహబూబ్‌నగర్‌లో 1,565, వరంగల్‌లో 1,329, సిద్దిపేటలో 1,146, మంచిర్యాలలో 1,232 కేసులు నమోదైనట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ జిల్లాల్లోనూ సగటున రోజుకు 700 నుంచి 900 కేసుల చొప్పున నమోదవుతుండగా, అందులో మూడో వంతు మాత్రమే బులిటెన్‌లో చూపిస్తున్నారు.
దీంతో వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 1,961కి పెరిగింది. మరోవైపు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 7,432 మందికి కరోనా సోకింది. ఇప్పటికే గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి, ఎంజీఎం(వరంగల్)తోపాటు కరోనా ట్రీట్‌మెంట్ అందించే ప్రధాన ఆసుపత్రులన్నింటిలో ఇప్పటికే బెడ్లన్ని నిండిపోయాయి. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉంటే.. సర్కారు మాత్రం టెస్టులపై చేతులెత్తేసింది. సింప్టమ్స్ ఉన్నోళ్లందరికీ కరోనా ఉన్నట్టుగానే భావించాలని హెల్త్ ఆఫీసర్లను ఆదేశించింది.
సెకెండ్ వేవ్‌లో కేసులు, మరణాలు జిల్లాల్లో, రూరల్ ఏరియాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో మాదిరి వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో, గ్రామీణ ప్రాంతాల్లో జనాలు ఆలస్యంగా హాస్పిటల్స్ కు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. రూరల్ ఏరియాల్లో మరణాలు ఎక్కువగా ఉండడానికి ఇది కూడా ఓ కారణమని డాక్టర్లు చెబుతున్నారు.
24 గంటల్లో 1,400 మంది ఆస్పత్రులకు..
రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 17,052 మంది హాస్పిటళ్లలో ఉండగా, శనివారం సాయంత్రానికి ఈ సంఖ్య 18,506కు చేరుకుంది. అంటే ఒక్క రోజులోనే 1,454 మంది కరోనా పేషెంట్లు హాస్పిటళ్లలో చేరారు. డిశ్చార్జ్ అవుతున్న వాళ్లు చాలా తక్కువగా ఉంటుండడంతో బెడ్ల కొరత ఎక్కువ పెరుగుతోంది. వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్లు దొరకడమే కష్టంగా మారింది. ప్రస్తుతం హాస్పిటళ్లలో ఉన్న 18,506 మందిలో 9,212 మంది ఆక్సిజన్‌పై ఉంటే, 5,216 మంది వెంటిలేషన్‌పై ఉన్నారు. అంటే హాస్పిటళ్లలో ఉన్నవాళ్లలో 80 శాతం మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. రాష్ర్టంలో ఇంకో 3,745 వెంటిలేటర్, 7,352 ఆక్సిజన్ బెడ్లు మాత్రమే మిగిలి ఉన్నట్టు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. కానీ ఏ హాస్పిటల్‌లో అడిగినా తమ దగ్గర వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా లేవని చెబుతున్నారు. కొన్ని చిన్న హాస్పిటళ్లలో ఉన్నా వాటిలో చేరేందుకు జనాలు భయపడుతున్నారు.
లక్షణాలుంటే కరోనా ఉన్నట్టే
పరిస్థితిని అంచనా వేసి అవసరమైన టెస్టింగ్ కిట్లు తెప్పించడంలో సర్కారు ఫెయిలైంది. దీంతో కిట్ల కొరత ఏర్పడింది. వచ్చిన వారికి టెస్టులు చేయకుండానే ఇంటికి పంపిస్తున్నారు. ఇలా తిరిగి తిరిగి టెస్టింగ్ సెంటర్ల దగ్గరే జనాలు కరోనా అంటించుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు అంటిస్తున్నారు. టెస్టింగ్ సెంటర్లు పెట్టి పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది. లక్షణాలు ఉన్నోళ్లందరికీ కరోనా ఉన్నట్టుగానే భావించాలని హెల్త్ ఆఫీసర్లను ఆదేశించింది. టెస్టులతో సంబంధం లేకుండా లక్షణాలు ఉన్నోళ్లందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇస్తామని ప్రకటించింది. ఆక్సిజన్, రెమ్డెసివిర్ సమకూర్చడంలో కేంద్రం ఫెయిల్ అయిందన్న రాష్ర్ట సర్కార్.. తన పరిధిలో ఉన్న టెస్టింగ్ కిట్లను కూడా సరిపడా తెప్పించలేదు. ప్రభుత్వం సరిగా టెస్టులు చేయకపోవడంతో ప్రైవేట్ హాస్పిటళ్లు దీన్నో దందాగా మార్చేశాయి. రూ.100 విలువ చేసే టెస్టుకు రూ.2 వేలకుపైగా వసూలు చేస్తున్నాయి.
రెమ్డెసివిర్ దొరుకుతలె
రెమ్డెసివిర్ ఇంజక్షన్ల షార్టేజీ రోగుల ప్రాణాల మీదికి తెస్తోంది. రెమ్డెసివిర్‌తో జనాలు కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతుండడంతో రోగుల కుటుంబ సభ్యులు ఆ ఇంజక్షన్లు తెచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలే తక్కువ సంఖ్యలో ఉత్పత్తి ఉండగా అవి కూడా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. రూ.3 వేల ఎంఆర్పీ ఉన్న ఒక్కో ఇంజక్షన్‌ను రూ.25 వేలకు అమ్ముతున్నారు. ఈ బ్లాకింగ్ దందాలో ఇంజక్షన్లను తయారు చేసే కంపెనీల ప్రతినిధులు, మెడికల్ ఏజెన్సీలు, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బ్లాకింగ్ దందా, ఆక్సిజన్ ధరలను నియంత్రించడంలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ పూర్తిగా ఫెయిల్ అయిందని హెల్త్ ఆఫీసర్లే అంటున్నారు.
ఆగని దోపిడీ
ప్రభుత్వ దవాఖాన కంటే ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లేందుకే జనం మొగ్గు చూపుతున్నారు. 30 శాతం మంది మాత్రమే సర్కార్‌కు పోతే, 70 శాతం మంది ప్రైవేటుకు పోతున్నారు. శుక్రవారం సాయంత్రానికి హాస్పిటళ్లలో ఉన్న 18,506 మందిలో 5,358 మంది ప్రభుత్వ దవాఖాన్లలో ఉంటే, 13,148 మంది ప్రైవేట్‌లో ఉన్నారు. మొదటి నుంచి పరిస్థితి ఇట్లనే ఉంటోంది. ప్రభుత్వం కూడా పేషెంట్లు ప్రైవేటుకే వెళ్లాలని కోరుకుంటోంది. అందుకే చిన్నాచితకా హాస్పిటళ్లకు కరోనా ట్రీట్‌మెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. కానీ బిల్లుల దోపిడీని తగ్గించే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. కొన్ని హాస్పిటల్స్ లో రోజూ రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల దాకా చార్జ్ చేస్తున్నారు. ఈ బిల్లులు కట్టేందుకు జనాలు ఆస్తులు అమ్ముకుంటున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పిన ప్రభుత్వం.. అసలు ఆ ఊసే ఎత్తడం లేదు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల బెడ్లు ఏమైనయ్
రాష్ట్రంలో 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో 14 వేల బెడ్లు ఉన్నాయని, వాటిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు యాజమాన్యాలు ఒప్పుకున్నాయని మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ప్రభుత్వ దవాఖాన్లు నిండితే, ఆ బెడ్లను వాడుకుంటామని చెప్పారు. వాటిలోని డాక్టర్లకు అవసరమైన పీపీఈ కిట్లు, పేషెంట్లకు ఫుడ్డు, మెడిసిన్ ఇతర సౌకర్యాలన్నీ ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. కానీ ఇప్పటిదాకా వాటిని సర్కార్ వాడుకోలేదు. గాంధీ, టిమ్స్ వంటి ప్రభుత్వ దవాఖాన్లలో బెడ్లు దొరక్క పేషెంట్లు చస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. మరోవైపు బెడ్లు ఇచ్చేందుకు తాము ఒప్పుకోలేదని ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్ల యాజమాన్యాలు చెబుతుండటం కొసమెరుపు.