‘బుట్టబొమ్మ‘ గా చిన్నారి తల్లీ ఫేమ్ నటి

‘బుట్టబొమ్మ‘ గా చిన్నారి తల్లీ ఫేమ్ నటి

అనిఖా సురేంద్రన్​.. అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ, ‘చిన్నారి తల్లీ... చిన్నారి తల్లీ...’ పాటలో అజిత్​ కూతురిగా నటించిన పాప అంటే మాత్రం వెంటనే గుర్తుకొస్తుంది. తమిళ డబ్బింగ్ సినిమాలు ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ వంటి బ్లాక్​బస్టర్​ సినిమాల్లో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్​తో ఆడియెన్స్​ని ఫిదా చేసింది..  బేబీ అనిఖ. ఇప్పటికే కోలివుడ్, మాలీవుడ్​ ఇండస్ట్రీల్లో నటించి అవార్డులు కూడా సొంతం చేసుకుంది. కెరీర్ బిగినింగ్​ నుంచే పెద్ద పెద్ద స్టార్స్​తో నటించింది. తన నటనతో మెస్మరైజ్​ చేసి తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో ఫ్యాన్స్​ని సంపాదించుకుంది.ఈ మలయాళీ క్యూట్ గర్ల్​ పర్సనల్ లైఫ్​, ఫ్యామిలీ బ్యాక్​గ్రౌండ్ గురించి...

అనిఖా సురేంద్రన్​... 2004, నవంబర్​ 27న పుట్టింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న మంజేరి ఆమె సొంతూరు. అనిఖ వాళ్ల అమ్మ ఉష, నాన్న సురేంద్రన్​,​ అన్న అంకిత్​. మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీలో పుట్టిన అనిఖకి సినిమా బ్యాక్​గ్రౌండ్ అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ల నాన్న బిజినెస్​ చేస్తాడు. అమ్మ హోమ్​ మేకర్​. అనిఖ వాళ్ల అన్న ఇప్పుడు ఆమె సోషల్​ మీడియా అకౌంట్స్​, రాబోయే సినిమాల షెడ్యూల్స్ చూసుకుంటున్నాడు. యాక్టింగ్, మోడలింగ్ అంటే అనిఖకి ఉన్న ఇష్టం. అందుకే చిన్నప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ​ధనుష్​, రానా, నయనతార, కత్రినా కైఫ్​లంటే చాలా ఇష్టం అంటున్న అనిఖ, ఆరేళ్ల వయసులోనే తన సినిమా కెరీర్​ని స్టార్ట్ చేసింది. దానికంటే ముందు 2007లో మూడేళ్ల వయసులో మోహన్​లాల్​ నటించిన మలయాళం సినిమా ‘చోటా ముంబై’తో మొదటిసారి వెండితెరపై కనిపించింది. ప్రస్తుతం కొచ్చిలో ఉన్న ‘కేరళ స్టెడ్స్​ ఐటి అకాడమీ’లో అండర్​ గ్రాడ్యుయేషన్​ చదువుతోంది. 

ఆరేళ్ల వయసులోనే కెరీర్​ స్టార్ట్

2010లో మలయాళం సినిమా ‘కధ తుడరున్ను’ అనే సినిమాలో చైల్డ్​ ఆర్టిస్ట్​గా​ చేసింది. అదే తన మొదటి సినిమా అని చెప్పొచ్చు. ఆ సినిమాలో అనిఖ పాత్రకి మంచి పేరొచ్చింది. అప్పటి నుంచి ఈ ఏడాది వరకు వరుస సినిమాలు చేసింది.  ప్రతి ఏడాది మలయాళం లేదా తమిళంలో ఒక్క సినిమాలో అయినా కనిపిస్తోంది. సినిమాలతో పాటు అప్పుడప్పుడు వెబ్​ సిరీస్​లు, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తుంటుంది అనిఖ. ‘ఎంతవాడు గానీ’(ఎన్నై అరింధాల్), ‘విశ్వాసం’ సినిమాల్లో అజిత్ కూతురి పాత్రలో నటించి మెప్పించింది. ఈ రెండు సినిమాల్లో వీళ్లిద్దరి మీదే ఎక్కువ సీన్స్, స్పెషల్ సాంగ్స్​ ఉన్నాయి. ఈ సినిమాలతోనే తెలుగు వాళ్లకు కూడా పరిచయమైంది. సినిమాలే కాకుండా, ‘క్వీన్’ వెబ్​ సిరీస్​లో కూడా నటించింది. రమ్యకృష్ణ లీడ్​ రోల్ చేసిన ఈ వెబ్​ సిరీస్​లో ‘శక్తి శేషాద్రి’ స్కూల్లో ఉన్నప్పటి రోల్​లో నటించింది. ఆమె నటించిన మొదటి వెబ్​ సిరీస్​ కూడా ఇదే. ఇప్పటికే మమ్ముట్టి, దుల్కర్​ సల్మాన్​, జయం రవి, విజయ్​ సేతుపతి వంటి తమిళ, మలయాళ స్టార్​​ యాక్టర్స్​తో స్క్రీన్​ షేర్​ చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినా బాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టమట అనిఖకి. వాటిలోనూ షారుఖ్​ ఖాన్​ సినిమాలంటే కాస్తంత ఎక్కువ ఇష్టం. తనకి ఇష్టమైన ప్లేస్​ ముంబై. 
టాలీవుడ్​లో కూడా...
డబ్బింగ్ సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళ కుట్టి త్వరలోనే డైరక్ట్ తెలుగు సినిమాలు చేయబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘‘కప్పేల’’ తెలుగులో  ‘‘బుట్ట బొమ్మ”గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో అనిఖ హీరోయిన్​గా సెలక్ట్​ అయ్యింది. ఈ మూవీని సితార ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై నిర్మిస్తున్నారు. అలాగే నాగార్జున, కాజల్ అగర్వాల్ కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో కూడా అనిఖ ఒక ఇంపార్టెంట్ రోల్​ చేయబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్​లో షూటింగ్
జరుపుకుంటున్న ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు డైరక్ట్​​ చేస్తున్నాడు. అంటే మరో మలయాళీ నటి టాలీవుడ్​ సిల్వర్ స్ర్కీన్​పై తెలుగు ఆడియెన్స్​కు దగ్గరవబోతోంది. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే అనిఖ, ఇన్​స్టాగ్రామ్, ఫేస్​బుక్​లలో తన లేటెస్ట్ అప్​డేట్స్​, ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్​ చేస్తుంటుంది.
అవార్డ్స్​​
13వ ‘ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్’ 2010లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్, 2013లో  ‘కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్​’లు అందుకుంది. 2015లో వచ్చిన ‘నయన’ అనే మలయాళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్​గా, టైటిల్​ రోల్​లో నటించింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు. 2015లో -బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్​గా ‘11వ రాము కర్యత్​ అవార్డ్’, 2017లో ‘వయలార్ అవార్డ్’​లను సొంతం చేసుకుంది బేబీ అనిఖ.