ఇలాంటి అత్యున్నత అవార్డును మొట్టమొదటి సారిగా1987లో ఒక విదేశీయుడికి ఇచ్చారు. ఆ విదేశీయుడే ‘సరిహద్దు గాంధీ’గా పేరుగాంచిన ‘ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్’. ఫిబ్రవరి 6న ఆయన జయంతి.ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మంచి గౌరవం గల పఠాన్ నాయకుల కుటుంబంలో ఫిబ్రవరి 6, 1890లో ఉస్మాన్ జాయి, చారసద్దలకు భారత్‌లో జన్మించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పెషావర్‌లోని పురపాలక బోర్టింగ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను, ఉన్నత విద్యను ఆలిఘర్లో చదివాడు.
ముస్లింలీగ్‌ను నమ్మలేదు
1912లో ఆయనకు వివాహం జరిగింది. సరిగ్గా ఆ సమయంలోనే దేశంలో ముస్లింలీగ్ పార్టీ ప్రారంభం జరిగింది. ముస్లిం లీగ్ తరఫున అనేక మేధావులు ఇచ్చిన ఉపన్యాసాలకు ఖాన్ హాజరై బ్రిటిష్ ప్రభుత్వం వారి క్రూర పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయటం కోసం ముస్లింలీగ్ పార్టీవారు కూడా తమ యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారని భావించాడు. అలాగే ఆ పార్టీవలన ఫక్తూన్ ప్రజలకు మేలు కలుగగలదని ఆశించాడు. కొద్ది రోజులలోనే ముస్లింలీగ్నిజస్వరూపం ఆయనకు అవగాహన అయింది. అది బ్రిటిష్ ప్రభుత్వం వారి కనుసన్నల్లో పనిచేసే పార్టీ అని గ్రహించాడు. మొత్తం ముస్లింలీగ్ ఉద్దేశ్యం, మహమ్మదీయులను స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సామాన్య జనజీవనం నుంచి దూరంగా ఉంచి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి వేరు చేయటానికేనని ఆయన గ్రహించాడు.
సరిహద్దు గాంధీగా మారాడు
బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆయన కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుతగిలినా, ఆయనను, ఆయన అనుచరులను ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో బంధించి చిత్రహింసలు పెట్టినా కూడా ఖాన్ తన లక్ష్యాలను మార్చుకోలేదు. చివరకు 1924లో ఆయనను విడుదల చేశారు. 1928లో గఫార్ ఖాన్ మహాత్మా గాంధీ , జవహర్‌లాల్ నెహ్రూను కలుసుకున్నాడు. నిజంగా బ్రిటిష్ వారి నుంచి విముక్తి చెంది దేశానికి స్వాతంత్ర్యం కోసం కృషి చేస్తున్న వారు వీరేనని, వీరితో కలిస్తేనే ఫక్తూన్ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందనే నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ప్రజలు ఆయనను ‘సరిహద్దు గాంధీ’ అని పిలవటం మొదలు పెట్టారు.
భారత్‌పట్ల అభిమానం
బ్రిటిష్‌వారికి వాయువ్య పరగణ ప్రాంతం ప్రత్యేక విభాగంగా గానీ లేక స్వతంత్ర భారతదేశంలో భాగంగా గానీ ఉండడం ఇష్టంలేదు. దేశ విభజన తరువాత ఆ ప్రాంతం అంతా పాకిస్తాన్‌తో కలిపివేయబడింది. గఫార్ ఖాన్ తాను మోసగించబడినట్లుగా గ్రహించాడు. ఆయన తన ప్రజల స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని అలాగే కొనసాగించాడు. పాకిస్తాన్ ఆయన ఆస్తినంతటిని స్వాధీనం చేసుకున్నది. స్వాతంత్ర్యానికి ముందు 15 సంవత్సరాలపాటు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 16 ఏండ్లు పాక్‌లో జైలు శిక్ష అనుభవించాడు. 1969లో భారత ప్రభుత్వపు ప్రత్యేక ఆహ్వానం మీద ఆయన భారతదేశంలో పర్యటించాడు. ప్రజలను అనేక ప్రాంతాలలో కలిసి ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయన మరణానికి ఒక సంవత్సరం ముందు 1987లో ఆయన చేసిన నిస్వార్థ త్యాగ సేవలకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం "భారత రత్న"ను ప్రదానం చేసింది. గఫార్‌ఖాన్ (98) 1988 లో కీర్తి శేషుడు అయినాడు. తన లక్ష్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అమరుడు.
- గడప రఘుపతిరావు
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత