అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్నే ‘ఎస్మా’ ( ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ) అంటారు. ప్రజలకు అవసరమైన కొన్ని అత్యవసర సేవలు ఆగకుండా కొనసాగేలా చూడడానికి 1981లో పార్లమెంటు ఈ చట్టాన్ని చేసింది.
ప్రజలకు అవసరమైన అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు లేదా సిబ్బంది డ్యూటీలకు డుమ్మా కొట్టి, సామాన్య జనానికి ఆ సేవలు అందకుండా సమ్మె చేస్తే ‘ఎస్మా ’ ను ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ‘ ఎస్మా’ చట్టం కల్పిస్తుంది. సమ్మెలో పాల్గొంటున్న వారికి ఆర్నెల్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించొచ్చు. సమ్మెకు ఎవరైనా ప్రోత్సహించినా వారికి కూడా ఏడాది పాటు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించే రూల్స్ ‘ ఎస్మా ’ చట్టంలో ఉన్నాయి.
అత్యవసర సేవలంటే….?
అత్యవసర సేవలందించే జాబితాలో మేజర్ గా నీటి సరఫరా, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, రైల్వే, ఎయిర్ పోర్ట్ , పోర్ట్ ఆపరేషన్స్, ప్రజా రవాణా వ్యవస్థ, హెల్త్ సర్వీసెస్ తో పాటు మరికొన్ని రంగాలు కూడా ఉన్నాయి. అత్యవసర సేవలందించే జాబితాలోకి ఏయే రంగాలు వస్తాయో అనే అంశంపై నిర్ణయం తీసుకునే హక్కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఎస్మా కు సంబంధించి ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఎసెన్షియల్ సర్వీసెస్ లిస్ట్ ఉంటుంది. ఒక రాష్ట్రంలో అత్యవసర సేవల జాబితాలోకి వచ్చే సర్వీస్ సెక్టార్ మరో రాష్ట్రంలో అక్కడి జాబితాలో ఉండకపోవచ్చు. ఈ అంశంపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదే.
ఎప్పుడు ‘ఎస్మా’ ప్రయోగించాలంటే…..
సమ్మెలను అణచివేయడానికి వీలుగా అపరిమిత అధికారాలు కట్టబెట్టే ‘ఎస్మా’ చట్టాన్ని ఎప్పుడు ప్రయోగించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. మనదేశంలోని చాలా రాష్ట్రాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కు సంబంధించిన కార్మికులు లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు సమ్మెలు చేసిన సందర్భాలున్నాయి. అయితే ‘ఎస్మా ’ ప్రయోగించిన సందర్భాలు చాలా తక్కువ. సమ్మె చేస్తున్న కార్మికులతో సాధ్యమైనంత వరకు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవడానికే ప్రభుత్వాలు ఎక్కువగా ప్రయత్నిస్తుంటాయి.