సలాం సలీం భాయ్​​

సలాం సలీం భాయ్​​

స్కూల్లో చదువుకునే రోజుల్లో క్రికెటర్​ అవుదామనుకున్నాడు. వీలుపడక బిజినెస్​మ్యాన్ అయ్యాడు.​ ఆ తరువాత యాక్టర్ అవుదామనుకున్నాడు. ​చివరకు వ్లాగర్​గా సెటిల్​ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నా జీవితం ఒక రోలర్​ కోస్టర్​ రైడ్’ అంటాడు 30 ఏండ్ల మొహమ్మద్​ సలీం ఖాన్. యూట్యూబ్​లో ‘ఎమ్​ఎస్​కె’ ఛానెల్​ నడుపుతున్న సలీం 75 ఏండ్ల అమృత్​ మహోత్సవ్​ వేడుకల్లో కల్చరల్​ బ్రాండ్​ అంబాసిడర్​గా సత్కారం అందుకున్నాడు.

సలీం వ్లాగ్స్​లో కనిపించేంత చీర్​ఫుల్​గా లేదు అతని బాల్యం. వెస్ట్​బెంగాల్​లోని దక్షిణ్​ దినాజ్​పూర్​ జిల్లాలో ఒక చిన్న ఊళ్లో పుట్టి, ముంబయిలోని ధారావిలో పెరిగాడు. వ్లాగింగ్​ జీవనాధారం అవుతుందని ఊహించలేదు అతను. వీడియో కంటెంట్​ మొదలుపెట్టక ముందు దొరికిన పనల్లా చేశాడు. నాన్న వాచ్​మెన్​గా, అమ్మ ఇండ్లలో పనులు చేసేది. కుటుంబానికి సాయంగా ఉండేందుకు దొరికిన పనల్లా చేసేవాడు సలీం. సలీంకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ కుటుంబం ధారావిలో చిన్న షాంటీ(మట్టి, చెక్కతో తయారుచేసిన ఇల్లు లాంటిది)ని అద్దెకు తీసుకుని ఉండేవాళ్లు.

ఆ విషయం మర్చిపోలేను
‘‘ధారావిలో నాజీవితం చాలా దారుణంగా ఉండేది. చిన్న విషయాలకు కూడా అక్కడ పెద్ద గొడవలు జరిగేవి. నీళ్ల దగ్గర కొట్లాటలు అయ్యేవి. ఒకరోజు మా అమ్మను చాలా తక్కువ చేసి మాట్లాడాడు ఒకతను. మేం ఉంటున్న షాంటీని ఖాళీ చేయమని బెదిరించాడు. ఆ ఘటన ఎంతగా బాధపెట్టిందంటే ఇప్పటికీ ఆ రోజు నేను మర్చిపోలేను. అలాంటి వాళ్లకి నా పనితోనే గట్టి సమాధానం చెప్పాలనుకున్నా. ఎలాగైనా మా కుటుంబానికి ఆర్ధికంగా అండగా ఉండాలనుకున్నా. పదమూడేండ్ల వయసులో వారానికి పది రూపాయలు కట్టి ఒక టైలర్​ దగ్గర హెమ్మింగ్​(వాలు కుట్టు) చేయడం నేర్చుకున్నా. నా మొదటి ఆదాయం పది రూపాయలు మా అమ్మ చేతికి ఇచ్చినప్పుడు చాలా గొప్పగా అనిపించింది. పదోతరగతికి వచ్చేవరకు ఒక పక్క చదువుకుంటూనే పనిచేశా. చేసే పని చిన్నదా? పెద్దదా? అని ఆలోచించేవాడ్ని కాదు. కొన్ని రోజులు హోటల్​లో వెయిటర్​గా కూడా చేశా.

క్రికెటర్​ కావాలనుకున్నా...
చిన్నప్పుడు క్రికెట్అంటే బోల్డెంత ఇష్టం ఉండేది. మనదేశం తరపున ఆడాలి అనుకునేవాడ్ని. ఒకరోజు స్కూల్లో క్రికెట్​ ఆడుతుంటే వెన్నుకి దెబ్బ తగిలింది. దాంతో క్రికెట్​ఆడాలన్న నా కల వదిలేయాల్సి వచ్చింది. నాకు పదహారేండ్లు వచ్చేసరికి ఫ్యాషన్​ యాక్సెసరీస్​ ఇ–కామర్స్​ బిజినెస్​ మొదలుపెట్టా. కాలేజీలో చదువుకునేటప్పుడు ఫ్లిప్​కార్ట్​ చేస్తున్న ఇ–కామర్స్​ గురించి తెలిసింది. అప్పట్నించీ నేనూ సెల్లర్​ కావాలి అనుకున్నా. అలా ఫ్యాషన్​ యాక్సెసరీస్​, లెదర్​ బ్యాగ్స్​, వ్యాలెట్స్​ను లోకల్​ మార్కెట్​లో కొని ఆన్​లైన్​లో అమ్మడం మొదలుపెట్టా. ఆ పనితో ఇంటికి కావాల్సినంత డబ్బు సంపాదించా. నాకు 21 ఏండ్లు వచ్చేసరికి ఒక ఇల్లు కూడా కొనుక్కున్నా. ముంబయిలో సొంత ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు అమ్మ కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఆ రోజు మా అమ్మ కళ్లలో కనిపించిన తృప్తి ఈ రోజున నేను ఎన్ని బైక్స్​ కొన్నా, నా లైఫ్​లో ఏం సాధించినా రాదు. ఇప్పుడు మా అమ్మను ఇల్లు ఖాళీ చేయమని ఎవరూ అడగరు కదా! ఇప్పుడా ఇంటికి రాణి ఆమె.

అనుకోకుండా వ్లాగర్​ 
నిస్సహాయస్థితిలో ఇ–కామర్స్​ మొదలుపెట్టా. కానీ యాక్టింగ్​ చేయాలనే ఇష్టం ఉండేది. క్రికెట్​ తరువాత నేను బాగా ఇష్టపడింది నటననే. యాక్టింగ్ స్కూల్లో చేరినప్పుడు అడ్వర్టైజ్​మెంట్స్​కి చేసే అవకాశం వచ్చింది. 2016లో నాసిక్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో నేను తీసిన ‘ఇన్సాన్’ షార్ట్​ ఫిల్మ్​​కు  బెస్ట్​ స్టూడెంట్​ ఫిల్మ్​ మేకర్​ అవార్డు వచ్చింది. సినిమాల కోసం చూస్తున్నప్పుడు వ్లాగింగ్​ కాన్సెప్ట్​ పరిచయం అయింది. అలా నా రోజువారీ పనుల గురించి రాయడం నాకు మంచిగా అనిపించేది. ఆ అలవాటే వ్లాగ్స్​కు స్క్రిప్ట్​ రాయడంలో సాయం చేసింది. సెప్టెంబర్​ 2016లోనే ‘ఎమ్​ఎస్​కె వ్లాగ్స్​’ అనే యూట్యూబ్​ ఛానెల్ మొదలుపెట్టా. నిజానికి దాని ద్వారా యాక్టర్​గా నా పర్సనాలిటీని మార్చుకోవాలనుకున్నా. కెమెరాని ఫేస్​  చేసే భయాన్ని వదిలించుకుని, కమ్యూనికేషన్​ స్కిల్స్​ మెరుగుపర్చుకుందాం అనుకున్నా. కానీ వ్లాగింగ్​​లోకి వచ్చాక ఈ పనిని ఎక్కువ ఎంజాయ్​ చేస్తున్నా. ఇప్పుడు నా కంటెంట్​ను చాలా బ్రాండ్స్​ స్పాన్సర్ చేస్తున్నాయి. అలా ఇది నాకు హాబీగా కంటే కూడా చాలా ఎక్కువైంది.

నా ట్రావెల్ జర్నీని ఇన్ఫర్మేటివ్​గా, ఎంటర్​టైనింగ్​గా చేయాలనే ఆలోచన 2019లో వచ్చింది. యూట్యూబ్​ కోసం కంటెంట్​ చేస్తానని, వ్లాగింగ్ చేస్తానని అనుకోలేదు. కాకపోతే నాకు ఎదురైన ప్రతీ అవకాశాన్ని చేజారనీయకుండా వాడుకున్నా. ఇప్పుడు నా పనిని నేను ఎంతో ప్రేమిస్తున్నా. నా జీవితంలో ప్రతిరోజూ కొత్తగా ఉంటుంది. చేసే పని రోజూ ఒకేలా ఉంటే బోర్​ కొడుతుంది నాకు. నాలాంటి వాళ్లు రెగ్యులర్​ జాబ్ చేయడం కష్టం. ఇప్పుడు చేస్తున్న పనిలో స్వేచ్ఛ ఉంది. అలాగే జీవనాధారం కూడా. ఇందులో ఉన్న బెస్ట్ పార్ట్​ నాకు నచ్చినప్పుడు లీవ్​ తీసుకోవచ్చు” అని నవ్వుతూ చెప్పాడు బీకాం గ్రాడ్యుయేట్​అయిన ఈ వ్లాగర్​.

దేశమంతా తిరగాలి​ 
టెడెక్స్​ స్పీకర్​ కూడా అయిన సలీం ‘‘నా లైఫ్, ట్రావెలింగ్​, బైక్​ రైడింగ్​... ఇలా అన్నింటినీ నా కెమెరా క్యాచ్​ చేస్తుంది. వాటన్నింటినీ వీడియోలుగా అప్​లోడ్​ చేస్తా. బైక్​ మీద లావోస్, మయన్మార్​, వియత్నాం సరిహద్దుల వరకు వెళ్లా. స్కూబా డైవర్​గా అండమాన్​లో ‘పడి’(PADI (ప్రొఫెషనల్​ అసోసియేషన్​ ఆఫ్​ డైవింగ్​ ఇన్​స్ట్రక్టర్స్​)) ట్రైనింగ్​ తీసుకున్నా. లడాక్​, సేలా పాస్, జోజి లా పాస్​​లో డెడ్లీ రోడ్డు మీద డ్రైవింగ్​ చేశా. తెల్లటి ఎడారి కచ్​ నుంచి పంచ్​ఘని హిల్స్​ రైడింగ్​, అరుణాచల్​లో మంచు రైడింగ్​ నుంచి అస్సామీ లోకల్​ ఫుడ్​ వరకు జర్నీ చేశా. నాకు ఇండియాని ఎక్స్​ప్లోర్​ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు వెయ్యికిపైగా లైఫ్​స్టయిల్, ట్రావెల్​ వ్లాగ్స్​ చేశా. దేశంలోని రకరకాల ప్రాంతాలకు జర్నీ చేశా. ఈ మధ్య న్యూఢిల్లీలోని జామా మసీదులో రంజాన్​ వేడుకల వీడియో అప్​లోడ్ చేశా. దీనికంటే ముందు హోలీ సెలబ్రేషన్స్​ కోసం మధురకు1,300 కిలోమీటర్లు జర్నీ చేశా. బైక్​ రైడ్​ చేసేటప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది.

హైదరాబాద్​కి వెళ్లి తిన్న టేస్టీ బిర్యానీ దగ్గరి నుంచి వెస్ట్​ బెంగాల్​లో చేసిన ఫిషింగ్​ వరకు ప్రతీది నేను ఫుల్​గా ఎంజాయ్​ చేస్తా. ట్రావెల్​ చేసేటప్పుడు మతాన్ని పక్కన పెట్టి ఎక్స్​ప్లోరర్​గా మారిపోతా. ముంబయి నుంచి లడాక్​, అస్సాం, నాగాలాండ్​, అరుణాచల్​, మేఘాలయ, రాజస్తాన్​, కేరళ, హిమాచల్​... ఇలా ఎన్నో ప్లేస్​లకు బైకింగ్​ చేశా. ఖతర్​, అబుదబి, దుబాయి, థాయిలాండ్​, మయన్మార్​, నేపాల్​, రష్యాలకు కూడా వెళ్లా.75 ఏండ్ల ఇండిపెండెన్స్​ సెలబ్రేషన్స్​ అమృత్​మహోత్సవ్​లో భాగంగా 75 మంది యువతను కల్చరల్​ బ్రాండ్ అంబాసిడర్స్​గా కేంద్ర సాంస్కృతిక శాఖ సత్కరించింది. ఆ సత్కారం నాక్కూడా దక్కింది. అది చాలా పెద్ద అఛీవ్​మెంట్. దానికంటే ముందు ఎన్నో అవార్డులు అందుకున్నా. కానీ ప్రభుత్వం నా పనిని గుర్తించి అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఫోర్బ్స్​ ఇండియాలో టాప్​ 100 డిజిటల్ స్టార్స్​ లిస్ట్​లో ఒకడిగా నిలిచా. వ్లాగర్​ ఆఫ్​ ది ఇయర్​ 2020 స్ట్రీమ్​కాన్​ ఏసియా అవార్డు అందుకున్నా. మనదేశంలో ఎక్స్​ప్లోర్​ చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది” అని చెప్పాడు సలీం.

బ్రాండ్ ఇంటిగ్రేషన్​తో నెలకు పదిహేను లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. అలాగని ప్రతినెలా ఇంతే వస్తుందని కాదు. కొన్నిసార్లు అంతకంటే తక్కువ, ఇంకొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా వస్తుంటుంది. ప్రతిరోజు ఉదయం11.11 గంటలకు లేదా మధ్యాహ్నం 03.30 గంటలకు కొత్త వ్లాగ్​ అప్​లోడ్​ చేస్తాడు.