డీ వన్ పట్టాల పేరిట భారీ భూదందా

డీ వన్ పట్టాల పేరిట భారీ భూదందా
  • డీ వన్ పట్టాల పేరిట భారీ భూదందా
  • నిర్మల్ జిల్లాలో 300 ఎకరాలకుపైగా ఆక్రమణ
  • మాజీ మంత్రి బంధువులు, బీఆర్ఎస్​ లీడర్లపై ఆరోపణలు
  • ఎస్సారెస్పీ నిర్వాసితుల పేర పట్టాల సృష్టి

నిర్మల్, వెలుగు:  నిర్మల్ జిల్లాలో అక్రమ డీవన్ పట్టాల వ్యవహారం కల కలం రేపుతోంది. అప్పటి బీఆర్ఎస్ మంత్రి బంధువులతో పాటు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, లీడర్లు పెద్దఎత్తున డీ వన్ పట్టాలను సృష్టించి సర్కారు భూములను కాజేశారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి తాజాగా ఈ అంశాన్ని సీఎం రేవంత్​ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించడంతో నిర్మల్​ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారికి  కేటాయించే డీ వన్ పట్టాలు నాలుగైదేండ్లుగా బీఆర్ఎస్ నేతలకు వరంగా మారాయి.

చాలాకాలం కింద  డీ వన్ పట్టాల జారీ, భూముల కేటాయింపు  ప్రక్రియ  ముగిసినా..బీఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 2014 నుంచి 2018 వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జిల్లాలో భూముల రేట్లు బాగా పెరగడంతో విలువైన సర్కారు భూములపై కన్నేసిన బీఆర్ఎస్ లీడర్లు నిర్వాసితుల పేరిట నకిలీ డీ వన్ పట్టాలు పుట్టించి..భూములు  కేటాయించినట్టు  రికార్డులు సృష్టించారు. ఈ వ్యవహారంపై  అప్పట్లోనే కాంగ్రెస్, బీజెపీ లీడర్లు ఆందోళనలు చేసినా  రాజకీయ ఒత్తిళ్ల వల్ల అధికారులు చర్యలకు వెనుకాడారు. 

ఒక్క గ్రామంలోనే 100 ఎకరాలకుపైగా

జిల్లాలోని  మామడ, లోకేశ్వరం, దిలావర్​పూర్, లక్ష్మణచందా, నిర్మల్ మండలాల్లో దాదాపు 300 ఎకరాలకు పైగా  అక్రమ డీ వన్ పట్టాల పేరిట భూములు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ఒక్క మామడ మండలం  న్యూలింగంపల్లిలోనే  దాదాపు 100 ఎకరాలకు పైగా భూములను  కాజేశారన్న ఫిర్యాదులు వచ్చాయి.  ఈ  గ్రామంలోని18 సర్వే నంబర్​లో దాదాపు 80 ఎకరాల  ప్రభుత్వ భూమికి  బినామీల పేరిట డీ వన్ పట్టాలను సృష్టించారని, ఆ తర్వాత  ఆ భూములను లీడర్లు తమ పేరు మీదికి మార్చుకున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే న్యూ సాంగ్వి గ్రామంలో కూడా దాదాపు వంద ఎకరాలకు పైగా భూములను డీ వన్ పట్టాల పేరిట కాజేశారన్న ఆరోపణలున్నాయి.

కాగా ఈ అక్రమాలపై గ్రామస్తులు  కలెక్టర్​కు,  ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటీవల కలెక్టరేట్ వద్ద ఆందోళన కూడా చేపట్టారు.  దిలావర్​పూర్ మండలంలో కూడా దాదాపు 100   ఎకరాలను డీ వన్ పట్టాల పేరిట బీఆర్ఎస్ నేతలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.  డీవన్ పట్టాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న కొందరు దళారులుగా వ్య వహరించగా..  అప్పటి  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బంధువులు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున భూదందా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. 

సీఎంకు ఫిర్యాదు చేసేందుకు రెడీ..

కొత్తగా  అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ బీఆర్ఎస్  హయాంలో జరిగిన భూదందాపై సీరియస్ గా దృష్టి సారించింది.  ధరణి పోర్టల్ పై వేసిన  ప్రత్యేక కమిటీ అధ్యయనంలో ఈ వ్యవహారం నిగ్గుతేలనుందని చెప్తున్నారు. దీనికి తోడు  నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి కూడా  డీ వన్ పట్టాల అక్రమాలపై ఫోకస్​ పెట్టారు.  ఎలక్షన్​ టైమ్​లోనే  ఆయన ఈ వ్యవహారంలో  మంత్రి బంధువుల పాత్ర ఉందని,  ఎన్నికల తర్వాత ఎంక్వైరీ జరిపిస్తామని  ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీఐ  కింద  డీవన్  పట్టాలు, బినామీలకు  భూముల కేటాయింపులు, తర్వాత ఆ భూములను ఇతరుల పేర్ల మీదికి మారుస్తూ జరిగిన రిజిస్ట్రేషన్ల సమాచారాన్నంతా  ఆయన సేకరించారు. పూర్తి వివరాలతో  ఒక నివేదికను  సీఎం రేవంత్ రెడ్డికి,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందించి విచారణ కోరనున్నట్టు మహేశ్వర రెడ్డి చెప్పారు.

గ్రామ అవసరాలకు గుంట జాగ లేదు 

మా ఊళ్లో ఉన్న  ఖాళీ  భూములను  కొంత మంది నాయకులు బినామీ పేర్లతో  డీవన్ పట్టాలు సృష్టించి  స్వాహా చేశారు.  గ్రామస్తుల అవసరాలకు కనీసం గుంట జాగ లేకుండా చేశారు.  గ్రామంతో సంబంధం లేని వారు నిర్వాసితుల పేర్ల తో  భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆందోళనలు చేసినప్పటికి ఎవరూ పట్టించు కోవడం లేదు.  
- డాక్టర్ గంగాధర్, న్యూ సాంగ్వి

కొత్త సర్కారు చర్యలు తీసుకోవాలి

న్యూ  లింగంపల్లిలో నకిలీ డీ వన్ పట్టాలతో జరుగుతున్న భూదందాపై  ఐదేండ్ల నుంచి పోరాడుతున్నాం.  గత సర్కారుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలే. పొరుగు జిల్లాల వారు కూడా ఇక్కడి భూములు కాజేశారు.  ఎస్సార్ఎస్పీ కింద నష్టపోయినవాళ్లకు మాత్రం న్యాయం జరగలేదు.  ఈ దందాపై  కాంగ్రెస్ ప్రభుతం  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. నకిలీ  పట్టాలు రద్దు చేసి ఆ భూములను  గ్రామంలో పేదలకు  పంచాలి.
- శ్రీనివాస్, న్యూ లింగంపల్లి