ఈ ఎండలకే మండుతున్నట్టుందా..? 35, 40 డిగ్రీలు కాదు.. తెలంగాణకు ఐఎండీ తాజా హెచ్చరిక ఏంటంటే..

ఈ ఎండలకే మండుతున్నట్టుందా..? 35, 40 డిగ్రీలు కాదు.. తెలంగాణకు ఐఎండీ తాజా హెచ్చరిక ఏంటంటే..

హైదరాబాద్: తెలంగాణలో ఎండలు ఈసారి మాములుగా ఉండవని, అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యన 10 నుంచి 11 రోజులు విపరీతమైన వేడి గాలులు, వడగాల్పులతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఈ ఎండల ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గర్, కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎండ ప్రభావం తక్కువగా ఉంటుందని, ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకూ భారీ వర్షాలు కురుస్తాయని.. వరదల కారణంగా కొండ చరియలు కూడా విరిగిపడే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది.

ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి.. మార్చి రెండో వారంలోనే 35 డిగ్రీలకు చేరుకొని ఆ తర్వాత 40కి అటు ఇటుగా నమోదవుతూ ఉంది. మార్చి 4న 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకుముందు వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మార్చి 1న 33 డిగ్రీలు, 2న 35 డిగ్రీలు, 3న మరో రెండు డిగ్రీలు పెరిగి 37కు చేరింది. మార్చి 4న ఏకంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలను చూస్తున్న జనం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. టెంపరేచర్లు 41 డిగ్రీల మార్క్ను దాటేస్తున్నాయి. మార్చి  30న (ఆదివారం) 16 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్యధికంగా జగిత్యాల జిల్లా గోధూరులో41.5డిగ్రీలు రికార్డయింది. సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, వచ్చే రెండు రోజుల పాటు ఎండలు ముదిరినా.. ఆ తర్వాత వరుసగా 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, భద్రాద్రి జిల్లా భద్రాచలం, కామారెడ్డి జిల్లా ఏలుపుగొండ, కరీంనగర్ జిల్లా గట్టుదుడ్డెనపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మార్చి 30న 41.4 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.

Also Read:-ఫూల్స్ డే అంటారు గానీ.. జీ మెయిల్, యాపిల్, RBI, ఇన్ కం ట్యాక్స్ పుట్టింది ఏప్రిల్ ఒకటినే..

ఆదిలాబాద్, జోగుళాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, వనపర్తి, నిర్మల్, ఖమ్మం, నాగర్​కర్నూల్, నిజామాబాద్, మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో 41 డిగ్రీలకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 నుంచి 40.8 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదయ్యాయి. ఒక్క జనగామ తప్ప అన్ని జిల్లాలూ ఆరెంజ్ అలర్ట్లోకి వెళ్లిపోయాయి. హైదరాబాద్లో ఆదివారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. మరో రెండు రోజులూ ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఏప్రిల్ 3వ తేదీన వడగండ్లు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.