మన దేశంలో సుమారు 70 శాతం రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య.. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ ఉత్పతుల మార్కెటింగ్ లో సరైన సంస్కరణలు చేయకపోవడం వల్లే దేశానికి వెన్నెముక అని చెబుతున్న రైతుకు అప్పులు తప్ప.. అభివృద్ధి కరువైంది. అయితే ఇటీవల నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ‘వ్యవసాయ ఉత్పతుల మార్కెటింగ్’ లో కొత్త సంస్కరణలకు తెరలేపింది. అందులో భాగంగా మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చింది. కానీ, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. నిజంగా కొత్త చట్టాలు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్నాయా? అసలు ఈ చట్టాలలో ఏముంది? ఈ చట్టాల వల్ల రైతులకు మంచి జరుగుతుందా? లేదా?
దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మన దేశ జీడీపీలో ఈ రంగం వాటా సుమారు 50 శాతం ఉండేది. కానీ ఇప్పుడు 15 శాతానికి పడిపోయింది. మన దేశంలో ఇతర రంగాలు రోజు రోజుకీ వేగంగా అభివృద్ధి చెందుతుంటే వ్యవసాయ రంగం, దానిపై ఆధారపడ్డ రైతు జీవితం మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. స్థూలంగా పరిశీలిస్తే, వ్యవసాయంలో ముఖ్యమైన రెండు దశలు ఉంటాయి. మొదటిది ‘పంట పండించడం’. ఈ ప్రక్రియ పెట్టుబడి, సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, శ్రమ, సాగు పద్ధతి, వాతావరణం వంటి వాటిపై ఆధారపడి ఉన్నది. ఇక రెండోది పండిన ‘పంట మార్కెటింగ్’ చేసుకోవడం. అంటే గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం. డిమాండ్, సప్లైలను పక్కన పెడితే, ఈ ప్రక్రియలో మేజర్ రోల్ ప్రభుత్వం, దళారులదే. ఇప్పటి వరకు రైతులు పండించిన పంటను ప్రభుత్వం, ప్రభుత్వ కార్పొరేషన్, దళారులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.
గిట్టుబాటు ధర రాకపోవడమే అసలు సమస్య
పంట పండించడంలో రైతులకు అవసరమైన పెట్టుబడి, సాగు నీరు అందించడంలో కొంత మేరకు ప్రభుత్వాలు సాయం చేస్తున్నారు. సాగుబడి పద్ధతుల్లోనూ పెను మార్పులు వస్తున్నాయి. కానీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో దశాబ్దాలుగా ఎటువంటి సంస్కరణలు రాలేదు. ఇప్పటికీ రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వానికి లేదా దళారులకు అరకొర ధరలకే అమ్ముకుంటున్నారు. రైతులు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర రాక అప్పులపాలవుతున్నారు. కొద్ది మంది అప్పులబాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పతుల మార్కెటింగ్ వ్యవస్థలో సరైన సంస్కరణలు వచ్చి, రైతు తన పంటకు తానే రేటు నిర్ణయించుకునే రోజు వస్తేనే ఈ దౌర్భాగ్యకర స్థితి తొలగిపోతుంది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో రైతులు తమ పంటకు మంచి రేటు ఎక్కడొస్తే అక్కడే అమ్ముకునే స్వేచ్ఛ దొరుకుతుందని ప్రధాని, సహా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలంతా చెబుతున్నారు. కానీ ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి చట్టాల్లో ఉన్న మంచి చెడులేంటి?
పంట ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ
రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం ద్వారా ‘ఒకే దేశం – ఒకే మార్కెట్’ విధానం రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ మార్కెట్ల నియంత్రణ, సరిహద్దులతో సంబంధం లేకుండా వేర్వేరు జిల్లాలు, రాష్ట్రాల మధ్య రైతులు స్వేచ్ఛగా తమ పంటను ఎక్కడైనా అమ్ముకునేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇలా అమ్మే వాటిపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు, ఫీజులు వసూలు చేయకూడదు. వ్యవసాయ మార్కెట్ కమిటీల నియంత్రణలోకి వచ్చే ఉత్పత్తులను ఆన్ లైన్ లో అమ్ముకునేందుకు కొత్త చట్టం అనుమతిస్తుంది. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయొచ్చు. పాన్ కార్డు ఉన్న కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, వ్యవసాయ సహకార సంస్థలు ఏవైనా ఈ–ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయొచ్చు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. 2016 లోనే కేంద్ర ప్రభుత్వం ‘ఈ నామ్’ ద్వారా ఆన్ లైన్ వర్తకాన్ని ప్రవేశపెట్టింది. పంజాబ్ లోని 37 మార్కెట్లలో, హర్యానాలోని 81 మార్కెట్లలో ఈ -నామ్ ద్వారానే వ్యవసాయ ఉత్పతుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. రైతులకు అప్పుడు లేని భయాందోళనలు ఇప్పుడు కొత్తగా అవసరం లేదు.
కాంట్రాక్ట్ సాగుతో పెట్టుబడి కష్టాలు తీరుతయ్..
కేంద్రం తెచ్చిన రెండో చట్టం.. రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం. రైతుల పంట వేయడానికి ముందే కొనుగోలుదారుడితో కనీసం ఒక పంట కాలం నుంచి ఐదేళ్ల వరకు ఒప్పందం కుదుర్చుకునేందు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఆ కాంట్రాక్ట్ రాసేటప్పుడే వ్యవసాయ ఉత్పత్తుల ధర, దాని నిర్ణయ ప్రక్రియను పేర్కొనాలి. సమస్యల పరిష్కారానికి సెటిల్మెంట్ బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పీలేట్ అథారిటీ అనే మూడంచెల వ్యవస్థ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ సాగు.. సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. రైతులకు పెట్టుబడి సమస్య ఉండదు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వాడకం వంటి వాటిపై ఒప్పందదారుడి సహకారం తీసుకోవచ్చు. పంట చేతికొచ్చే టైమ్ కి మార్కెట్ ధర ఒప్పంద ధర కంటే ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరనే రైతుకు చెల్లించాలి. అలాగే ఒప్పంద ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉంటే ఒప్పంద ధర ఇవ్వాల్సిందే. అయితే రైతుల్లో నిరక్షరాస్యత సమస్యను అలుసుగా తీసుకుని ఒప్పందం చేసుకునే వాళ్లు మోసం చేస్తారేమోన్న ఆందోళన న్యాయమైందే. అలాగే సమస్యల పరిష్కారంలోనూ అధికారులు తమను పట్టించుకుంటారా? అన్న ఆవేదన వారిలో ఉంది. ఇక కేంద్రం కొత్త తెచ్చిన మూడో చట్టం నిత్యవసర సరకుల సవరణ చట్టం. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న 1955 నాటి నిత్యవసర సరకుల చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ కొత్త చట్టం చేశారు. వ్యవసాయ రంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచడానికి, వినియోగదారుల ప్రయోజనాలు రక్షిస్తూనే నిత్యవసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరణకు ఈ చట్టాన్ని సవరించారు.
కొత్త చట్టాల్లో సవరణలు అవసరమే
ఎంతో కీలకమైన వ్యవసాయ ఉత్పతుల మార్కెటింగ్ సంస్కరణలపై రైతుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలకు కొన్ని సవరణలు చేయాలి. ముఖ్యంగా’కనీస మద్దతు ధర’ను ప్రకటించే విషయం చట్టంలో చేర్చాలి. ‘కాంట్రాక్ట్ సాగు’ సమస్యల విషయంలో అప్పిలేట్ విధానం కాకుండా నేరుగా న్యాయస్థానాల్లో నిర్దిష్ట కాలపరిమితిలోగా పరిష్కారం దొరికేలా మార్పులు చేయాలి. అలాగే కొన్ని నిత్యవసర వస్తువులను పేర్కొని వాటి నిల్వలపై చట్టపరమైన చర్యలను కఠినతరం చేయాలి. మార్కెట్ యార్డుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆల్టర్నేటివ్ చూపించాలి. అలాగే ఈ చట్టాలపై ప్రజల్లో, రైతుల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చర్చలు, సభలు పెట్టాలి.
ఆ భయం అక్కర్లేదు!
కొత్త చట్టం అమలైతే పంట ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ వస్తుందంటున్నా రైతుల్లో కొన్ని భయాందోళనలు నెలకొన్నాయి. తాము వ్యవసాయ మార్కెట్/మండీల బయట ప్రైవేట్ వ్యాపారులకు పంటను అమ్ముకుంటే ‘కనీస మద్దతు ధర’ లభిస్తుందా లేదా? ఒకవేళ వ్యాపారులు సిండికేట్ గా మారితే తమ పరిస్థితి ఏమిటి? అని భయపడుతున్నారు. కానీ ఇప్పటివరకు కేవలం దళారులే పంటను కొనేవారు ఇకపై నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్, రిటైలింగ్ సంస్థలు కూడా రైతుల దగ్గర నుంచి కొనే అవకాశం ఉంటుంది. గిట్టుబాటు ధర వచ్చేదాకా పంటను నిల్వ చేసుకోకుండా ఎక్కువ ధర ఉన్న ప్రాంతాలలో అమ్ముకోవచ్చు. స్థానిక మండీలో మంచి ధర వస్తే అక్కడైనా అమ్ముకోవచ్చు. స్థానిక మండీలు ఇకపై ఉండవు అనేది అవాస్తవం. కొత్త చట్టాల ద్వారా రైతు సంఘాల వ్యవస్థ బలోపేతం అవుతుంది. రిటైల్ రంగంలోకి స్వయంగా రైతు సంఘాలు ప్రవేశించవచ్చు. నిర్దిష్ట ప్రణాళికలతో ఈ చట్టాలను అమలు చేయగలిగితే మన దేశ వ్యవసాయ రంగంలో మంచి మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు.
అగ్రి చట్టాలతో రైతులకు మేలే
- వెలుగు ఓపెన్ పేజ్
- December 21, 2020
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే