
- ఇప్పటికే 50 వేల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు
- వానలు తగ్గడంతో జోరందుకుంటున్న వరికోతలు
- సెంటర్లకు 90 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 8వేలకు పైగా సెంటర్లు ప్రారంభించాలని సివిల్ సప్లయ్స్ శాఖ నిర్ణయించగా, ఇప్పటికే వెయ్యికి పైగా సెంటర్లను ఓపెన్ చేశారు. యాసంగిలో పెద్ద మొత్తంలో ధాన్యం సెంటర్లకు వచ్చే అవకాశం ఉంది. ముందస్తు కోతలవుతున్న జిల్లాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ ఊపందుకుంటున్నది.
మరోవైపు చెల్లింపులు వేగంగా జరిగేలా వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. జిల్లా జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లయ్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆయా జిల్లాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించి, నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
గతంలో కంటే ముందే కొనుగోళ్లు
రాష్ట్రంలో గతంలో ఏటా ఏప్రిల్ 15 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే పరిస్థితి ఉండేది. కానీ, ఈ యేడు 25 రోజుల ముందస్తుగానే సెంటర్లు ప్రారంభించారు. ఇటీవల వరుసగా 2 రోజులపాటు రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసిన నేపథ్యంలో ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నందున.. కొనుగోళ్లు కొంతమేర మందగించాయి.
అకాల వర్షాలు తగ్గినప్పటినుంచి తేమ శాతం తగ్గి.. కొనుగోళ్లు స్పీడప్ అయ్యాయి. ఏర్పాట్లు వేగవంతం చేయడంతో కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. మరో వారం పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగంగా జరుగనున్నాయి. సెంటర్లకు వచ్చిన ధాన్యం కాంటా పెట్టి వెంట వెంటనే మిల్లులకు తరలించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సివిల్ సప్లయ్స్ యంత్రాంగం ప్రతిరోజూ జిల్లా అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని.. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో పరిశీలించి, పరిష్కరించేందుకు కృషి చేస్తున్నది.
భారీగా ధాన్యం వస్తుందని అంచనా
ఈ యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 56.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సన్న ధాన్యానికి సర్కారు బోనస్ ప్రకటించిన నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం 1.30 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాగైన వరిలో 60 శాతం సన్న రకాలే ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు సెంటర్లకు దాదాపు 90 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని సివిల్ సప్లయ్స్ శాఖ అంచనా వేస్తున్నది.