Champions Trophy: మా ఆటగాడికి బుద్ది లేదు.. పాక్ స్పిన్నర్‌పై వసీం అక్రమ్ విమర్శలు

Champions Trophy: మా ఆటగాడికి బుద్ది లేదు.. పాక్ స్పిన్నర్‌పై వసీం అక్రమ్ విమర్శలు

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఆటపైనే కాదు ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. రెండు మ్యాచ్ ల్లోనూ పోరాడకుండానే ప్రత్యర్థి ధాటికి చేతులెత్తేసింది. దీంతో సొంత దేశంలోని  అభిమానులే ఆ జట్టుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 23) భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లందరూ సమిష్టిగా విఫలమయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిరాశపరిచారు. ప్రదర్శన సంగతి పక్కనపెడితే ఆటగాళ్ల ప్రవర్తన కూడా హద్దులు దాటింది. ముఖ్యంగా పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ చేసిన పని ఎవరికీ నచ్చలేదు. 

అసలేం జరిగిందంటే..?   
      
ఇన్నింగ్స్ 17 ఓవర్ లో ఒక అద్భుతమైన బంతితో అబ్రార్ టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ ను బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతిని క్యారం బాల్ తో సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ ను బోల్తా కొట్టించాడు. ఈ స్టన్నింగ్ డెలివరీకి గిల్ షాక్ లో ఉండిపోయాడు. వికెట్ తీసిన వెంటనే పాక్ స్పిన్నర్ చేసిన ఓవరాక్షన్ టీమిండియా ఫ్యాన్స్ కు నచ్చలేదు. నిలబడి పేస్ పక్కకి తిప్పుతూ గిల్ ను పెవిలియన్ కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. వికెట్ తీసినా అతని ఆటిట్యూడ్ పై విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ సైతం అబ్రార్ చేసిన పనిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

వసీం అక్రమ్ విమర్శలు:

స్పోర్ట్స్ సెంట్రల్‌లో అక్రమ్ మాట్లాడుతూ.. "సెలెబ్రేట్ చేసుకోవడానికి ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది. జట్టు పోరాడుతున్నప్పుడు కాకుండా జట్టు గెలిచినప్పుడు లేదా ఆటగాడు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినప్పుడు మాత్రమే ఇలాంటి సెలెబ్రేషన్స్ నేను సమర్ధిస్తాను. అబ్రార్ ప్రవర్తన టీవీలో చూస్తున్నప్పుడు నాకు నచ్చలేదు. ముఖ్యంగా పాకిస్తాన్ ఒత్తిడి సమయంలో అతను వినయంగా ఉండాలి. అబ్రార్ బంతి నాకు నచ్చింది. కానీ పాకిస్థాన్ గెలుపుకు దూరమవుతున్న పరిస్థితిలో ఆ సెలబ్రేషన్ నాకు నచ్చలేదు". అని ఈ పాక్ దిగ్గజ బౌలర్ అన్నాడు.