డ్యూటీకి రాకపోతే రూ.300 ఫైన్

  • కొత్తగూడెం ఏరియాలో కాంట్రాక్టర్స్​ వింత రూల్
  • సింగరేణిలో కాంట్రాక్ట్​ వర్కర్స్​ వెట్టి చాకిరి  
  • జీతం ఎప్పుడిస్తరో కూడా తెలియదు
  • జాబ్​లు అమ్ముకుంటున్నా పట్టించుకునేవారేరి?

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ ​కంపెనీ కొత్తగూడెం ఏరియాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ వర్కర్స్​ వెట్టిచాకిరి చేస్తున్నారు. టెండర్​లో వర్క్స్​కు బదులు ఇతర పనులు చేయిస్తున్నారు. యాక్సిడెంట్​జరిగితే కాంట్రాక్టర్​తో పాటు మేనేజ్​మెంట్ తమకు సంబంధం లేదన్నట్టు ​వ్యవహరిస్తోంది. ఏదైనా అత్యవసర పని ఉండి ఒక్కరోజు డ్యూటీకి రాకపోతే రూ. 300 ఫైన్​కట్టించుకుంటున్నారు. లేదంటే డ్యూటీ బంద్​ చేయాలని కాంట్రాక్టర్​ హెచ్చరిస్తాడు. ఒకవేళ ఎవరికైనా కాంట్రాక్ట్ ​వర్కర్ ​జాబ్​కావాలంటే రూ. 30 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.  

15వ తేదీ తర్వాతే జీతాలు
సింగరేణి కాలరీస్​ కంపెనీ కొత్తగూడెం ఏరియాలోని మైన్స్​, రుద్రంపూర్​ కోల్​హ్యాండ్లింగ్​ ప్లాంట్​(ఆర్​సీహెచ్​పీ), ఓసీలతో పాటు పలు డిపార్ట్​మెంట్లలో దాదాపు 3వేల మందికి పైగా కాంట్రాక్ట్ వర్కర్స్​ పని చేస్తున్నారు. కాంట్రాక్ట్​ వర్కర్స్​కు ప్రతి నెల 7వ తేదీలోపు జీతం ఇవ్వాలని రీజినల్​ లేబర్​ కమిషన్​(ఆర్​ఎల్​సీ) నుంచి ఆదేశాలున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రతి నెల 15వ తేదీ తర్వాతనే ఇస్తున్నారు. కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న వారికి నెలాఖరులో మరికొన్ని విభాగాల్లో పనిచేస్తున్న వారికి రెండు నెలలకోసారి జీతం ఇస్తుండడం కామన్​గా మారింది. ప్రతి నెల ఏడో తేదీలోపు కాంట్రాక్టర్​ జీతం ఇవ్వకుంటే ఆ జీతాన్ని సింగరేణి మేనేజ్​మెంట్​ఇచ్చి కాంట్రాక్టర్​కు చెల్లించే బిల్లులోంచి జమచేసుకోవాలని ఆర్ఎల్​సీ నుంచి ఆర్డర్స్​ఉన్నాయి అయినా మేనేజ్​మెంట్​పట్టించుకోవడం లేదు. 

డ్యూటీకి రాలేదా? అయితే ఫైన్​కట్టు
జ్వరం వచ్చి ఒక్కరోజు ఆబ్సెంట్​అయినా, బంధువులు చనిపోయినా, కొవిడ్ ​వ్యాక్సిన్ ​వేయించుకున్న తర్వాత  జ్వరం, నొప్పులతో బాధపడుతున్నా డ్యూటీకి రావాల్సిందే. రాకపోతే ఆబ్సెంట్ అయిన రోజుకు రూ.300 చొప్పున కాంట్రాక్టర్​ముక్కుపిండి వసూలు చేస్తున్నాడు. ఏరియాలో రుద్రంపూర్​ కోల్ ​హ్యాండ్లింగ్​ ప్లాంట్​లో ఓ కాంట్రాక్టర్ ఇలా ​ఫైన్ల పేర దోచుకుంటున్నారని వర్కర్స్​ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య పని చేసే చోట ఓ కార్మికుడు గాయపడి నాలుగు రోజులు ఆబ్సెంట్​అయితే అతడి దగ్గర రూ.1,200 ఫైన్​వసూలు చేశాడని చెబుతున్నారు. మరో వర్కర్​బంధువు చనిపోయినా ఇలాగే చేశాడంటున్నారు. అక్టోబర్​2, మే డే వంటి హాలిడేస్​లోనూ డ్యూటీ చేయాల్సిందేనని, లేకపోతే ఫైన్ ​కట్టాల్సిందేనంటున్నారు. డబ్బులు ఆరోజు కాకపోతే మరుసటి రోజు ఇవ్వాలని, లేకపోతే ఉద్యోగం ఉండదని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.  

జాబ్ ​కావాలంటే రూ.30 వేలు 
కొత్తగా ఎవరైనా వర్కర్​ జాయిన్​ అయితే అతడి దగ్గరి నుంచి రూ. 30 వేల నుంచి రూ. 50వేలు కాంట్రాక్టర్​ వసూలు చేస్తున్నాడు. ఇక  కార్పొరేట్​పరిధిలో కాంట్రాక్ట్​ జాబ్​ కావాలంటే రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు ఇచ్చుకోవాలి. సేఫ్టీకి ఫస్ట్​ ప్రియార్టీ అని చెప్పే మేనేజ్​మెంట్ ​కాంట్రాక్ట్​ వర్కర్స్​కు షూస్, టోపీలు కూడా ఇవ్వడం లేదు. ఆర్​సీహెచ్​పీలో రూల్స్​కు అగైనెస్ట్​గా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై కనీసం  రిపోర్టింగ్​ కూడా ఉండదు. యాక్సిడెంట్​అయినా డ్యూటీకి రావాల్సిందేనని కాంట్రాక్టర్లు పట్టుబడుతుంటారు. బెల్ట్​ఆగినప్పుడే క్లీన్ ​చేయాల్సి ఉన్నా బొగ్గుతో రన్నింగ్​లో ఉన్న టైంలో క్లీనింగ్​చేయిస్తున్నారు. సేల్ ​పిక్కింగ్ ​వర్కర్స్​ను రోలర్స్ ​ఎత్తేందుకు, ఇతర వర్క్స్​కు వాడుకుంటున్నారు. మహిళా వర్కర్స్​ను ఆఫీసర్ల  రూంల వద్ద పని చేయిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆందోళన, నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తే వేధిస్తారని చెబుతున్నారు.  

శ్రమదోపిడి చేస్తున్నారు
కాంట్రాక్ట్​ వర్కర్స్​ను సింగరేణి, కాంట్రాక్టర్లు శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. సంబంధం లేని పనులు చేయిస్తున్నారు. ప్రతి నెల 7వ తేదీన జీతం ఇవ్వాలని ఆర్ఎల్​సీ చెప్పినా కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదు. ఆఫీసర్ల దృష్టికి తీసుకెళితే ఇప్పిస్తామని, తర్వాత పట్టించుకోవడం లేదు.  
- రాసూరి శంకర్​, సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికుల హక్కుల పరిరక్షణ  సంఘం ప్రెసిడెంట్, కొత్తగూడెం

ఫైన్​ వేయడమేంటి ?  
ఒక్క రోజు డ్యూటీకి రాకపోతే ఫైన్​వేయడమేంటి? ఆరోగ్యం బాగా లేకపోతే డ్యూటీకి ఎలా వస్తారు? టెండర్​లో కోట్​ చేసినట్టే పనులు చేయించాలి. పలువురు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనుల చేయిస్తూ వేధిస్తున్నారు. పద్ధతులు మార్చుకోకపోతే పోరాటాలు తప్పవు.  
- సంజయ్​, ఇఫ్టూ జిల్లా లీడర్​

ఎంక్వైరీ చేయిస్తా
డ్యూటీకి రాకుంటే ఫైన్​ వేయడం కరెక్ట్​కాదు. ఇంత వరకు ఈ విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై ఎంక్వైరీ చేయిస్తా. ప్రతి నెల 7వ తేదీలోపు జీతం ఇచ్చేలా కాంట్రాక్టర్లతో మాట్లాడాలని ఆఫీసర్లను ఆదేశించా. సేఫ్టీ విషయంలో రాజీ పడేది లేదు. 
వర్కర్స్​కు కాంట్రాక్టర్​ షూస్​, టోపీలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటా. 
-  సీహెచ్​. నర్సింహారావు, ఏరియా జీఎం, సింగరేణి కొత్తగూడెం ఏరియా