హిస్టరీ రిపీట్స్ అంటారు. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇలాంటి రిపీట్స్ మామూలే. గతంలో ఇరాక్ మాజీ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్, అల్–ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, లిబియా లీడర్ కల్నల్ గడాఫీ, ఇప్పుడు ఐసీస్ చీఫ్ అబూ బకర్–అల్ బాగ్దాదీ సరిగ్గా అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు ముందు సంవత్సరాల్లోనే హతమయ్యారు. వీళ్లలో సద్దాం హుసేన్ పట్టుబడి, కోర్టు విచారణ తర్వాత ఉరిశిక్షకు గురవగా, మిగతా వాళ్లలో ఇద్దరు అమెరికా దాడుల్లో హతమయ్యారు. గడాఫీ దేశం విడిచి పారిపోతూ లిబియన్లకు దొరికిపోయి దారుణంగా చనిపోయారు. వీళ్లకోసం అమెరికా ప్రత్యేకంగా జరిపే మిలిటరీ ఆపరేషన్లకు పేర్లుకూడా పెట్టింది.
1) 2003 సద్దాంని పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకున్న సంవత్సరం 2003. ఆ తర్వాత ఏడాది 2004లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో జూనియర్ బుష్ రెండోసారి గెలిచారు. సద్దాంకోసం జరిపిన ఆపరేషన్ పేరు ‘ఆపరేషన్ రెడ్ డాన్’.
2) 2011లో లాడెన్‌ని అబోటాబాద్ (పాకిస్థాన్)లో అమెరికా నేవీ దళం మట్టుబెట్టింది. ఆ తర్వాత 2012లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో బరాక్ ఒబామా రెండోసారి గెలిచారు. బిన్ లాడెన్ కోసం అమెరికా సైన్యం పెట్టిన పేరు ‘ఆపరేషన్ నెఫ్ట్యూన్ స్పియర్’.
3) 2019లో బకర్–అల్ బాగ్దాదీని సిరియా నార్త్‌వెస్ట్ ప్రాంతంలో అమెరికా సైన్యం వెంబడించడంతో బాగ్దాదీ తనను తాను కాల్చుకు చచ్చిపోయాడు. వచ్చే ఏడాది జరిగే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో మళ్లీ పోటీకి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. బాగ్దాదీకోసం అమెరికా జరిపిన ఆపరేషన్ ‘కేలా ముల్లర్’ మూడోది.
పైన చెప్పిన వాళ్లు అమెరికాకి పక్కలో బల్లెంలా తయారైనవాళ్లే. లాడెన్, బాగ్దాదీలను ఆఫ్ఘనిస్తాన్, సిరియాల్లో లోకల్ ప్రభుత్వాలపైకి ఎగదోసి, వారి యాక్షన్ ప్లాన్లకు అమెరికా సహకరించిందని ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతారు. అమెరికా మొదట్లో ఆయుధాలను సప్లయ్ చేయడం, వాటితో మిలిటెంట్లు రెచ్చిపోవడం, చివరకు వాళ్లను హతం చేయడం పరిపాటి. వీళ్లు సమైక్య అరబ్ రాజ్యం ఏర్పాటుకు ప్రయత్నాలు సాగించి అమెరికాని రెచ్చగొట్టినవాళ్లే కావడం చెప్పుకోవలసిన విషయం.