యాసంగి సాగుకు సరిపడా నీరు.. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కళకళలాడుతున్న రిజర్వాయర్లు

  • మిడ్​మానేరులో 24 టీఎంసీలు, ఎల్​ఎండీలో 18  టీఎంసీలు
  • ఎస్సారెస్పీలో 59 టీఎంసీలు  
  •  ఉమ్మడి జిల్లాలో 4  లక్షల ఎకరాలకు సాగునీరు
  •  మల్కపేట రిజర్వాయర్​కు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్​

కరీంనగర్/పెద్దపల్లి/రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఈసారి యాసంగి సాగుకు ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో సమృద్ధిగా నీరు ఉంది. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయకున్నా.. రైతన్నకు ఇబ్బంది లేకుండా సాగునీరందించేందుకు ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల జిల్లాలోని కాకతీయ, లక్ష్మీ కాల్వల కింద సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఒక్క జగిత్యాల జిల్లాలోనే 1.63 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీరందుతోంది. 

రిజర్వాయర్లలో సమృద్ధిగా  నీళ్లు 

ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 59.237 టీఎంసీలుగా ఉంది. నిరుడు ఇదే సమయానికి 52 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలకు కోరుట్ల, జగిత్యాల పట్టణాలకు 61 క్యూసెక్కులు, ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాలకు 63 క్యూసెక్కులు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి పట్టణాలకు 107 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.  

అలాగే మిడ్​మానేరులో 24 టీఎంసీలు, ఎల్​ఎండీలో 18  టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉమ్మడి జిల్లాలో మూడు నెలల ప్రణాళికతో 4 లక్షల ఎకరాలకు ఆన్ ఆఫ్ పద్ధతిలో(వారం విడిచి వారం) నీటిని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 31 నుంచి ఎల్ఎండీ నుంచి  కాకతీయ కెనాల్‌‌‌‌‌‌‌‌కు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

రాజన్న జిల్లాలో సాగునీటికి నో వర్రీ 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సాగుకు సమృద్ధిగా సాగు నీరందుతోంది. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో కోనరావుపేట, వేములవాడ మండలాల్లో వరి పొలాలకు సాగునీటి కొరత తీరింది. ఎస్సారెస్పీ ద్వారా మిడ్ మానేరుకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో మిడ్ మానేరు లో 24 టీఎంసీ నీరు నిల్వ ఉంది.

 మిడ్ మానేరు నుంచి మల్కపేటకు, లోయర్ మానేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ మానేరు కెపాసిటీ 2 టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీని కింద దాదాపు 50 వేల ఎకరాలు సాగవుతున్నాయి. ఇల్లంతకుంట అన్నపూర్ణ  ప్రాజెక్ట్ కెపాసిటీ 3.5 టీఎంసీలుగా కాగా 3.1టీఎంసీ నీరు నిల్వ ఉంది. ఈ నీటితో 30 వేల ఎకరాల పంటలు సాగవుతున్నాయి.  

ఎస్సారెస్పీ కాల్వలకు రిపేర్లు..

పెద్దపల్లి జిల్లాలో యాసంగిలో టేల్ ఎండ్ వరకు సాగునీరు అందించే దిశగా సర్కార్, స్థానిక ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. గతంలో ఎస్పారెస్పీ డీ83, 86 కెనాల్స్ ద్వారా నీరందించేవారు. వీటిని రిపేర్ చేయకపోవడంతోపాటు నీటి విడుదలపై నమ్మకం కుదరక రైతులు సాగుచేయడానికి వెనుకాడేవారు. ఈ క్రమంలోనే  జిల్లాలో ఎస్సారెస్పీ నీటి ప్రాధాన్యం  గుర్తించిన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎస్పారెస్పీ కాలువల రిపేర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్ వరకు పూడుకుపోయిన కాల్వలను రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో యాసంగిలోనూ దిగుబడులు పెరిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.