కవులు, రచయితలపై ఏబీవీపీ కార్యకర్తల దాడి

  • కేయూలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలపై పిడిగుద్దులు   
  •     సదస్సు ఫ్లెక్సీ చించివేత
  •     పర్మిషన్​ ఏదంటూ వాగ్వాదం 
  •     పోలీసుల సమక్షంలోనే అటాక్​

హనుమకొండ, వెలుగు : వరంగల్ ​కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్‌ హాల్‌లో ఆదివారం ‘సమూహ’ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో  ‘లౌకిక విలువలు- సాహిత్యం’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు హాజరైన కవులు, రచయితలపై ఏబీవీవీ కార్యకర్తలు దాడికి దిగారు. తొలుత సాయంత్రం ఏబీవీపీకి చెందిన ముగ్గురు లీడర్లు అక్కడకు వచ్చి సదస్సును అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అనుమతి ఎవరిచ్చారంటూ, పర్మిషన్ ​లెటర్​ చూపించాలని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సదస్సు ఫ్లెక్సీని చించేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఏబీవీపీ లీడర్లను హాల్​ నుంచి బయటికి తీసుకెళ్లారు. తర్వాత అరగంటకు పైగా సదస్సు కొనసాగింది. కొద్దిసేపటికి రచయితలు, కవులు బయటకు వస్తుండగా అప్పటికే గుంపుగా ఉన్న ఏబీవీపీ లీడర్లు వెంట పడ్డారు.

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీత పసునూరి రవీందర్, నరేశ్ కుమార్ ​సూఫీ, కవి భూపతి వెంకటేశ్వర్లుపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. మరో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహిత మెర్సీ మార్గరేట్​ను బూతులు తిట్టారని నిర్వాహకులు తెలిపారు. కాగా,పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. 

ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి 

సదస్సు నిర్వహిస్తుండగా చొరబడి ఫాసిస్టు మూక చేసిన దాడిని ఖండిస్తున్నామని ‘సమూహ’ సెక్యులర్ రైటర్స్ ఫోరం కన్వీనర్లు, నిర్వాహకులు  ప్రొఫెసర్‌ కాత్యాయనీ విద్మహే, మెట్టు రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తితో సాహిత్య సదస్సు జరుపుతుంటే ఫాసిస్టు మూక దాడికి పాల్పడటం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమేనన్నారు.

వరంగల్‌ గడ్డమీద కవులమీద దాడి ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదానికి సంకేతమన్నారు. ఎన్నికల్లో ఫాసిస్టు శక్తులను ఓడించాలన్నారు. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, కాళోజీ ఫౌండేషన్, పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, పీడీఎస్​యూ, అభ్యుదయ రచయితల సంఘం, ఉజ్వల సాహితీ సంస్థ, తెలంగాణ రాష్ట్ర కవుల సంక్షేమ సమాఖ్య, మానవ హక్కుల వేదిక, వరసం దాడిని ఖండించాయి.  

కోడ్​ ఉన్నా అనుమతి ఎలా ఇచ్చారు ? : ఏబీవీపీ

ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నా వీసీ, రిజిస్ట్రార్​ బేఖా తరు చేశారని, సదస్సుకు  అనుమతి ఎలా ఇచ్చారని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాచర్ల రాంబాబు ప్రశ్నించారు. వారు చేసిన ప్రసంగాలు హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా ఉండడంతో సదస్సును అడ్డుకున్నామన్నారు. దీనిపై ఎలక్షన్​ కమిషన్​తో పాటు కేయూ పీఎస్​లో ఫిర్యాదు చేశామన్నారు. 

సెక్యులరిజం పరిరక్షణకు కవులు, రచయితలు ముందుండాలి:నందిని సిధారెడ్డి

సెక్యులరిజం పరిరక్షణకు కవులు, రచయితలు కృషి చేయాల్సిన అవసరముందని సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్​ డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. కేయూ సెనెట్​ హాలులో  ‘లౌకిక విలువలు- సాహిత్యం’ అనే అంశంపై  కవి డాక్టర్ యాకూబ్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో నందిని సిధారెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. చరిత్ర మారినప్పుడు అస్తిత్వాలు మారుతాయని, అస్తిత్వాలు మారితే  సమాజంలో విలువలు కూడా మారుతాయన్నారు.

స్వాతంత్ర్య కాలం నుంచి భారతీయ సమాజంలో లౌకికవాద విలువలను ప్రజలు అనుసరించారని, మనుషులను మనుషులుగా గౌరవించే పరిస్థితులే గొప్ప సమాజ విలువలకు దారి తీస్తాయన్నారు. వర్ణధర్మం ఆధునిక సమాజంలో చెల్లదని, అస్తిత్వ సమూహాల మధ్య సమన్వయంతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. సాహితీ విమర్శకుడు గుంటూరు లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ మతం ప్రాతిపదికన రాజ్యం నడవొద్దని, పాలనలో మతం జోక్యం ఉండొద్దన్నారు.

రామాయణంలో రుషులకు సంపదలు సాధించడం కోసం శ్రీరాముడు రాక్షసులపై హింసకు పాల్పడ్డట్లుగానే..నేడు అంబానీ, అదానీ కోసం దండకారణ్యంలో రామరాజ్యం కోసం ఆదివాసీలపై నేటి పాలకులు యుద్ధం చేస్తున్నారని కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే అన్నారు. రాముడు అయోధ్యలో చేసిందేమీ లేదని, అరణ్యవాసంలో తనతో విరోధం లేని రాక్షసులను కూడా చంపాడన్నారు.

మోదీ కాలంలోనూ విపరీతంగా అడవుల ఆక్రమణ జరుగుతోందని, ఆ విధ్వంసాన్ని చూస్తుంటే వాల్మీకి రామాయణాన్ని మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు లోచన్, కేయూ రిజిస్ట్రార్​ పి.మల్లారెడ్డి, సమూహ కన్వీనర్ మెట్టు రవీందర్​, ప్రముఖ విమర్శకులు డా. జిలుకర శ్రీనివాస్​, కవులు, రచయితలు నాళేశ్వరం శంకరం, కటుకోజ్వాల ఆనంద చారి, స్కైబాబ, పొట్లపల్లి శ్రీనివాసరావు, బిల్హ మహేందర్, తైదల అంజయ్య, కోడం కుమారస్వామి, రాపోలు సుదర్శన్ పొన్నాల బాలయ్య, కందుకూరి అంజయ్య, అన్వర్ , అమృతరాజు, సభావట్ హతీరాం పాల్గొన్నారు.