పెబ్బేరు, జడ్చర్ల టౌన్, వెలుగు : ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. శుక్రవారం స్టూడెంట్లతో కలిసి పెబ్బేరు చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. జడ్చర్లలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సతీశ్ మాట్లాడుతూ స్కాలర్ షిప్స్ రిలీజ్ చేయకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు స్టూడెంట్లను ఇబ్బంది పెడుతున్నాయని వాపోయారు. ప్రభుత్వ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించి జేఎల్, డీఎల్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఎంఈవో,డీఈవో పోస్టులు ఖాళీగా ఉండడంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైందన్నారు. హాస్టళ్లలో తరుచూ ఫుడ్ పాయిజన్ అవుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు భాస్కర్, శ్రీకాంత్, రవి, కురుమూర్తి, అరుణ్, సాయి, కిషోర్, రాజేశ్వర్, రఘు, తేజ, అరుణ్, శివ, నందిని, అఖిల, పూర్ణ, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రానికి రైతుల ఉసురు తగుల్తది
నెట్‌వర్క్, వెలుగు: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రానికి రైతుల ఉసురు తగులుతదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ హైకమాండ్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేలా కల్లాల నిర్మాణం చేపడితే.. ఆ ప్రయత్నానికి కేంద్రం గండి కొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. కల్లాల నిర్మాణానికి వెచ్చించిన రూ.150 కోట్లను కేంద్రనిధికి తిరిగి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ప్రవేశించడంతో బీజేపీ అగ్ర నాయకత్వం వెన్నులో వణుకు మొదలైందని విమర్శించారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్దన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
చిరుతను ఏటీఆర్‌లో వదిలేసిన్రు
అమ్రాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని హెటిరో ఇండస్ట్రీలో హల్‌చల్ చేసిన చిరుతను ఫారెస్ట్ ఆఫీసర్లు అమ్రాబాద్ రిజర్వ్‌లో వదిలేశారు. కొన్నిరోజుల పాటు జూపార్కులో ఉంచిన అధికారులు గురువారం రాత్రి మన్ననూర్ పరిధిలోని సాంపేన్ పడేల్ వద్ద వదిలేసినట్లు ఫీల్డ్ ఆఫీసర్ ఈశ్వర్ శుక్రవారం తెలిపారు.
హన్వాడలో చిరుత కలకలం
హన్వాడ , వెలుగు: హన్వాడ మండల పరిధిలోని బాలాజీకొండ టెంపుల్ సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ప్రధాన రోడ్డు దాటుతూ కనిపించిందని 108 సిబ్బంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై రవినాయక్ ఫారెస్ట్ శాఖ ఆఫీసర్స్, స్థానిక ఎంపీపీ బాలరాజుతో కలిసి రాత్రి మొత్తం గస్తీ నిర్వహించారు. పెద్దదర్పల్లి, హన్వాడ, దొరితండా, పల్లెమోనికాలని, కొత్తచెరువు తండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
సూచించారు .
జింకలను చంపిన వేటగాళ్ల అరెస్ట్
అచ్చంపేట, వెలుగు: జింకలను వేటాడి చంపిన ఆరుగురిని అమ్రాబాద్ టైగర్రిజర్వ్పారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ ఎఫ్‌డీవో శ్రీనువాస్ వివరాల ప్రకారం.. మద్దిమడుగు రేంజ్ ఇప్పలపల్లి సెక్షన్పరిధిలోని మన్నెవారి పల్లి బీట్‌లో కొందరు వ్యక్తులు గురువారం రాత్రి అడవి జంతువులను వేటాడినట్లు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో బక్క లింగాయ పల్లి, ఉస్మాన్ కుంట, చేపల గట్టు గ్రామాల్లో వేటగాళ్ల ఇండ్లపై దాడులు నిర్వహించారు. బక్క లింగాయపల్లి గ్రామానికి చెందిన రామావత్ మోత్యా, రమావత్ శివ, చప్పడ కుంట్లకు చెందిన కేతావత్ఠాగూర్, కేతావత్ కిషన్, కేతావత్ శివ, ఉస్మాన్ కుంటకు చెందిన నున్యావత్తులసీరాంను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి జింక తల, దవడ, కాళ్లు, 5 కిలోల మాంసం, రెండు గొడ్డళ్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. జింకలను కుక్కలతో తరిమి శ్రీశైలంబ్యాక్వాటర్లో పడ్డాక.. బోట్సాయంతో చంపినట్లు విచారణలో తేలిందని, బోట్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎఫ్‌డీవో తెలిపారు. మరో 10 మంది ప్రమేయం ఉండొచ్చని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
- బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి
పానగల్, వెలుగు: రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే బీజేపీకి మద్దతివ్వాలని పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి కోరారు.నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు చేపట్టిన పాదయాత్రలో శుక్రవారం పాల్గొన్నారు. పానగల్ మండలం కేతపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. గత ఎన్నికల్లో ఎల్లేని సుధాకర్ రావు ఓడిపోయినా కేంద్ర మంత్రులను ఒప్పించి సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి, జాతీయ రహదారి నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కేంద్రం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు రంగులు వేస్తూ తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎల్లేని సుధాకర్ రావుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్, నేతలు రామన్ గౌడ్, అన్వేష్, రోజా రమణి, భాను, ముంత వెంకటేశ్ పాల్గొన్నారు.
డంపింగ్ యార్డును తొలగించాలి
- బీఆర్‌ఎస్ నేతలు, కాలనీవాసుల ధర్నా
అమనగల్లు,వెలుగు: ఆమనగల్లు పట్టణంలోని గుర్రంగుట్ట కాలనీలో ఇండ్ల మధ్య ఉన్న డంపింగ్‌యార్డును తొలగించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాలనీవాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘డంపింగ్‌యార్డు హటావో.. కాలనీవాసులకు బచావో ’ అని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇండ్ల మధ్య ఉన్న డంపింగ్‌యార్డు ఉండడంతో కాలనీవాసులు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు. దుర్వాసనతో పాటు చెత్తను కాల్చి వేయడంతో వచ్చే పొగతో శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, కడ్తాల్ జడ్పీటీసీ దశరథ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, వైస్ ఎంపీపీ అనంత రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గిరి యాదవ్, నేతలు దశరత్ నాయక్ పాల్గొన్నారు.