ఏబీవీపీ వర్సెస్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్​లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కరీంనగర్  సిటీ, వెలుగు : ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ లీడర్లు, కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. సంగారెడ్డి జిల్లాలో ఎస్ఎఫ్ఐ లీడర్లపై దాడికి  నిరసనగా శుక్రవారం కరీంనగర్​లోని తెలంగాణ చౌక్‌‌లో ఏబీవీపీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా ఈ గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ  నాయకుడు హరీశ్‌‌  తలకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్  మాట్లాడుతూ  ఏబీవీపీ లీడర్లు సైద్ధాంతికంగా  తమను ఎదుర్కోలేక భౌతిక దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఎస్‌‌ఎఫ్‌‌ఐ లీడర్లు తమ సంఘం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా దాన్ని లాక్కునేందుకు యత్నించామని, దీంతో ఎస్ఎఫ్ఐ లీడర్లు తమను దూషిస్తూ, దాడికి ప్రయత్నించారని చెప్పారు. విద్యా రంగ సమస్యల పరిష్కారంలో ఎస్ఎస్‌‌ఐకి ఆదరణ తగ్గిపోతున్నదని, ఈ క్రమంలో ఏబీవీపీని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే తమపై దాడులకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు.