- జాతి నిర్మాణంలో ఏబీవీపీ
- పరిషత్ ఏర్పాటై 73 ఏండ్లు
స్వాతంత్ర్యం వచ్చాక దేశ యువతలో బానిసత్వాన్ని తొలగించి, వారిని చైతన్యంచేసేందుకు 1949 జులై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఏర్పాటైంది. 72 వసంతాలు పూర్తి చేసుకొని 73 వసంతంలోకి అడుగుపెట్టింది. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంచుతూ జాతి పునర్ నిర్మాణమే లక్ష్యంగా ఏబీవీపీ ముందుకు సాగుతోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడెంట్ యూనియన్
మారుమూల గ్రామాల నుంచి మహా నగరాల వరకు విస్తరిస్తూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా పరిషత్ ముందుండి పరిష్కరిస్తోంది. కాలేజీల్లో సౌలతులు, ఫీజు రియంబర్స్ మెంట్, హాస్టళ్లలో సమస్యలు, అకడమిక్ ఇబ్బందులు.. ఇలా విద్యార్థుల సమస్యలే కాదు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే సంఘటన ఎక్కడ జరిగినా అనుక్షణం స్పందిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన పరిషత్ నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరిస్తూ 35 లక్షల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా విరాజిల్లుతోంది. గడిచిన 72 ఏండ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరెన్నో విజయాలను చూసింది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా 'సృజన', మెడికల్ విద్యార్థుల కోసం 'మెడివిషన్', మన దేశంలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ 'WOSY', ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల కోసం 'SEIL', గిరిజన విద్యార్థుల కోసం 'వనవాసి', పర్యావరణ పరిరక్షణ కోసం 'స్టూడెంట్ ఫర్ డెవలెప్ మెంట్', విద్యార్థుల్లో సేవా భావం పెంచేందుకు 'స్టూడెంట్ ఫర్ సేవ', విద్యార్థి కళాకారులను ప్రోత్సహించేందుకు 'కళామంచ్', ఐఐటీ, నిట్ స్థాయి విద్యార్థుల కోసం 'థింక్ ఇండియా'.. ఇలా అనేక రకాల కార్యక్రమాలతో విద్యార్థులకు లీడర్ షిప్ ను అందిస్తూనే.. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఇలా జాతీయ పునర్ నిర్మాణం మహాయజ్ఞంలో పని చేసిన అనేక మంది నేడు ప్రధాని, ఉపరాష్ట్ర పతి మొదలు ప్రజాప్రతినిధిగానూ, ఉన్నత ఉద్యోగస్తులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఇలా ప్రతి రంగంలోను పరిషత్ నేర్పిన క్రమశిక్షణ, కార్యదీక్షతో ముందుకెళ్తున్నారు.
సిద్ధాంతం కోసం పని చేస్తూ...
జాతీయవాద సిద్ధాంతం కోసం, కాలేజీ క్యాంపస్ లలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పుటకై అనేక మంది పరిషత్ కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి సంఘటనలు వింటేనే రక్తం మరుగుతుంది. ఆనాడు కాలేజీ క్యాంపస్ లలో భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినదిస్తే చంపేస్తామని బెదిరించే విదేశీ సిద్ధాంతమైన కమ్యూనిస్టు, వాటి అనుబంధ సంఘాలు కాకతీయ యూనివర్సిటీ లాంటి క్యాంపస్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అప్పటి వీసీ జాతీయ జెండా ఎగురవేస్తున్న సందర్భంలో రాడికల్స్ రౌడీల్లా వచ్చి ఇది బూటకపు స్వాతంత్ర్యమని జాతీయ జెండాను అవమానిస్తూ నల్ల జెండా ఎగురవేస్తున్న సమయంలో పరిషత్ కార్యకర్త జగన్మోహన్ జీ ఒక్కడే రాడికల్స్ ను ఎదిరించి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో రాడికల్స్ ఆయనను అతి కిరాతంగా హతమార్చారు. ఇదే మాదిరిగా ఓయూలో మేరెడ్డి చంద్రన్న, నల్గొండ జిల్లాలో ఏచూరి శ్రీనన్న, కరీంనగర్ లో రామన్న, గోపన్న ఇలా తెలంగాణ ప్రాంతంలో 40 మందికిపైగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు బలయ్యారు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఏబీవీపీ కార్యకర్తలు ఏనాడూ భయపడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ.. నేటి మా తరానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఫలితంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నేటి పరిషత్ కార్యకర్తలు 'క్షణం క్షణం మా కణం కణం -భరత మాతకై సమర్పణం' అంటూ సమాజ సేవలో ముందుకు సాగుతున్నారు.
ఉద్యమంలో పెద్దన్న పాత్ర
దేశవ్యాప్తంగా ఏబీవీపీ అనేక ఉద్యమాలను నిర్మించింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని 1996లో నెల్లూరు మీటింగ్ లో తీర్మానం చేసిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏబీవీపీనే. మలిదశ ఉద్యమంలో విద్యార్థి పరిషత్ పెద్దన్న పాత్ర పోషించింది. రాష్ట్ర సాధనకు అనేక వినూత్న కార్యక్రమాలు చేసి విద్యార్థి లోకాన్ని, తెలంగాణ సమాజాన్ని నిస్వార్థంగా ఉద్యమం వైపు నడిపించిన ఘన చరిత్ర ఏబీవీపీ సొంతం. నిర్మాణాత్మక, ఆందోళనాత్మక కార్యక్రమాలతోపాటు సమాజ సేవలోనూ ఏబీవీపీ ముందుంటుంది. దేశంలో ఏ విపత్కర పరిస్థితులొచ్చినా.. వెంటనే పరిషత్ కార్యకర్తలు స్పందించి సమాజసేవలో నిమగ్నమవుతారు. కరోనా కారణంగా దేశమంతా ఇండ్లకే పరిమితమైన పరిస్థితుల్లో ఏబీవీపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రాణాలను లెక్క చేయకుండా వారియర్లుగా పని చేశారు. లాక్ డౌన్ కారణంగా గత రెండేండ్లుగా విద్యాసంస్థలు మూతపడిన సమయంలో ఆన్ లైన్ క్లాసులను అందుకోలేని బస్తీ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 'పరిషత్ కి పాఠశాల' పేరుతో చదువు అందించిన ఘనత పరిషత్ కార్యకర్తల సొంతం. రాబోయే రోజుల్లో ఏబీవీపీ 75 వసంతాల సందర్బంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినూత్న కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ మహా ఉద్యమంలో విద్యార్థులంతా భాగస్వాములై దేశాభివృద్ధిలో పాలుపంచుకుందాం.
- పి.శ్రీహరి, ఏబీవీపీ-సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్