జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఏబీవీపీ లీడర్లు ఆరోపించారు. జగిత్యాలలో కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్లు, విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ గురువారం ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగే కాంగ్రెస్ సర్కార్ కూడా విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా, వారి జీవితాలతో ఆడుకుంటోందన్నారు. గురుకులాలు, హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిలో 51 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాకేశ్, జిల్లా కన్వీనర్ సునీల్, జోనల్ ఇన్‌చార్జి నిఖిల్, పాల్గొన్నారు.
వేములవాడరూరల్, వెలుగు: వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ లీడర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి భరత్, ప్రభాస్, శివ సాయి పాల్గొన్నారు.