వనపర్తి టౌన్, వెలుగు: ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో స్కూళ్లు, కాలేజీ సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలని గతంలో వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు.
దీంతో వివిధ గ్రామాల నుంచి వనపర్తికి వచ్చే స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొందరు ఆర్టీసీ సిబ్బంది స్టూడెంట్లను చూసి స్టేజీల వద్ద బస్సులు ఆపకుండా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న దృష్ట్యా ఆర్టీసీ అధికారులు బస్సులను సరైన టైమ్‌కు నడిపించాలని కోరారు. అనంతరం డీఎం వేణుగోపాల్ కు వినతిపత్రం అందజేశారు. కేదార్నాథ్, కార్తీక్, నవీన్, శివ, సాయి, మనోజ్ పాల్గొన్నారు.