శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలి

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలి

కరీంనగర్ టౌన్,వెలుగు : కరీంనగర్ సిటీలోని శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలని  ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జెల్లపెల్లి అంజన్న డిమాండ్ చేశారు. శనివారం శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఎదుట   మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో యూనివర్సిటీ వెనుకబాటుకు  గురైందని ఆరోపించారు.  

కనీస మౌలిక వసతులు కూడా కల్పించకపోవవడం సిగ్గుచేటు అని వాపోయారు.  వర్సిటీలోని 12 కోర్సుల్లో 8 కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ గా మార్చడంతో మెరిట్ స్టూడెంట్లు సైతం ప్రయివేట్ కాలేజిల్లో చెల్లించిన  విధంగా   ఒక్కో కోర్సుకు రూ.35వేల నుంచి  రూ.45వేలు చెల్లించాల్సి వస్తోందని  తెలిపారు.  వర్సిటీ కూడా ఓ ప్రయివేట్ విద్యాసంస్థగా తయారైందని విమర్శించారు.

అధికారులు స్పందించి వెంటనే యూనివర్సిటీలో రెగ్యులర్ కోర్సులను ప్రవేశపెట్టి, పీహెచ్ డి నోటిఫికేషన్ విడుదల  చేయాలని డిమాండ్  చేశారు.  లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.  కార్యక్రమంలో కార్యకర్తలు మల్లేశ్, రమేశ్​, సాగర్  పాల్గొన్నారు.