
నిజామాబాద్, వెలుగు: తెలంగాణ వర్సిటీకి ఈశ్వరీబాయి పేరు పెట్టాలనే ప్రయత్నాలను గవర్నమెంట్ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం వర్సిటీలో ఏబీవీపీ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. అడ్మినిస్ర్ట్రేట్బిల్డింగ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే పేరును మార్చి మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి పేరు పెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్ర సాధన కోసం స్టూడెంట్స్ చేసిన ఉద్యమాలు, వారి త్యాగాలకు వర్సిటీ సజీవ సాక్ష్యమన్నారు. అనంతరం ఏబీవీపీ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్చారి ఆధ్వర్యంలో వీసీ యాదగిరిరావును కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో విద్యార్థి నాయకులు మోహన్, నవీన్, అనీల్, లెనిన్, అజయ్, సంతోష్, వినోద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేరు మార్పు లేదు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
తెలంగాణ వర్సిటీ పేరు మారుస్తున్నారనే ప్రచారంలో నిజంలేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. వర్సిటీ పేరును మార్చబోతున్నారనే వదంతిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అలాంటిదేమీలేదని ఆయన కొట్టిపారేశారన్నారు. పేరు మార్పు ప్రతిపాదన ఎవరు తెచ్చినా పర్మిట్ చేయొద్దని విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణాకు స్పష్టమైన ఆర్డర్స్ జారీ చేశారన్నారు. జిల్లాకు మంజూరైన జవహర్ నవోదయ స్కూల్‌ను జక్రాన్‌పల్లి మండలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా ఉన్న అంశాలను సీఎంకు వివరించగా పాజిటివ్‌గా స్పందించారని తెలిపారు.