హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి : హాస్టల్స్ ఇన్‌‌చార్జి మారవేణి రంజిత్ కుమార్

నల్గొండ అర్బన్, వెలుగు : విద్యాసంస్థలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలను పరిష్కరించడం లేదని  ఏబీవీపీ తెలంగాణ హాస్టల్స్ ఇన్‌‌చార్జి మారవేణి రంజిత్ కుమార్ మండిపడ్డారు.  సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని పలు హాస్టళ్లను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. మంగళవారం ఏబీవీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..  గురుకులాలకు పక్కా భవనాలు లేక శిథిలావస్థకు చేరిన భవనాలకు అద్దె చెల్లిస్తూ నిర్వహించడం దారుణమన్నారు.   సరిపడా టాయిలెట్స్, బాత్రూమ్‌‌లు కూడా లేవని, విద్యార్థులు అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.  

వివిధ కారణాలతో గురుకులల్లో 25 మంది విద్యార్థులు బలయ్యారని, దాదాపు 1500 మంది ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.  నాణ్యమైన భోజనం అందించడంలోనూ సర్కారు విఫలమైందన్నారు.  మెస్ చార్జీలు పెంచకపోవడంతో స్కూల్‌‌ నుంచి వర్సిటీల వరకు క్వాలిటీ లేని భోజనం తినాల్సి వస్తోందన్నారు.  విద్యా రంగ సమస్యలపై ఆగస్టు 1న హైదరాబాద్‌‌లో నిర్వహించనున్న విద్యార్థి సింహగర్జనను సక్సెస్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్, నగర కార్యదర్శి హేమంత్, సాయికిరణ్, ఎన్​జీ కళాశాల అధ్యక్షులు ప్రశాంత్, జిల్లా ఆఫీస్ సెక్రటరీ  నాంపల్లి మధు, రవిశంకర్, గౌతం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.