సుల్తానాబాద్, వెలుగు : సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ శనివారం ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల విద్యాలయాల రీజినల్ కోఆర్డినేటర్ మేరీ యేసుపాదం హాస్టల్ ను విజిట్ చేసి వెళ్తుండగా అడ్డుకున్నారు.
డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగలేశ్వర్, ఎస్సై శ్రీధర్ ఆందోళనకారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఈ సంఘటనపై డీఎస్ డబ్ల్యూఓ విచారణ చేపట్టారు.
హాస్టల్ లో స్పెషల్ మెడికల్ క్యాంప్
ఫుడ్ పాయిజన్ సంఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం స్పెషల్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ హాస్టల్ ను సందర్శించి స్టూడెంట్స్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్రెపల్లి పీహెచ్ సీ వైద్యాధికారి అనుదీప్, శ్రీజ, ఉదయ బృందం పాల్గొన్నారు.
ఖాళీ అవుతున్న హాస్టల్
హాస్టల్ లో 25 మంది స్టూడెంట్స్ కు ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు హాస్టల్ ను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. సంఘటన గురించి పేపర్లలో వార్తలు రావడంతో పేరెంట్స్ ఉదయాన్నే హాస్టల్ కు చేరుకొని తమ పిల్లలను తీసుకువెళ్లారు.
ఎమ్మెల్యే పరామర్శ
చికిత్స పొందుతున్న స్టూడెంట్స్ ను శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పరామర్శించారు. చికిత్స పొందుతున్న స్టూడెంట్స్ గౌతమ్ నాయక్, సాత్విక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.