- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో పెరిగిన సేల్స్
న్యూఢిల్లీ: ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు అమ్మే కంపెనీలు ఖుషీగా ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్స్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఈ పండుగ సీజన్‌లో సేల్స్ 30 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. దంతేరాస్ టైమ్‌లో ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా సేల్స్ పుంజుకుంటాయని అప్లియెన్స్ అండ్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొత్త ఫీచర్ల కోసం అదనంగా ఖర్చు చేయడానికి కన్జూమర్లు వెనకడుగు వేయడం లేదని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి టెక్నాలజీలతో నడిచే ప్రొడక్ట్‌లపై అదనంగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, పానాసోనిక్, సోని, గోద్రెజ్ అప్లియెన్సెస్, హయర్ ఈ ఏడాది ఓనమ్ పండుగ నుంచి తమ ఫెస్టివల్ సేల్స్‌ను మొదలు పెట్టాయి. సేల్స్ ఊపందుకున్నాయని, ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం ప్రొడక్ట్‌ల సేల్స్ కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్‌లో సుమారు 15 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నాయి. బీఎస్‌హెచ్ హోమ్ అప్లియెన్సెస్ తమ ఈ–కామర్స్ సేల్స్ 40 శాతం పెరిగాయని ప్రకటించింది. హయర్ తమ సేల్స్ 30–35 శాతం వృద్ధి చెందాయని పేర్కొంది. సాధారణంగా ఫెస్టివల్ సీజన్ ఓనమ్‌తో మొదలై దీపావళితో ముగుస్తుంది.
అదనపు ఫీచర్లకు ఓటు..
కంపెనీలు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు అదనపు ఫీచర్లతో అప్లియెన్స్‌లను తీసుకొచ్చాయి. 51 ఇంచుల కంటే ఎక్కువ స్క్రీన్ సైజ్ ఉండే టీవీలను, ఎక్కువ లోడ్ కెపాసిటీ ఉండే వాషింగ్ మెషిన్లను, ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లను (రెండు డోర్లు) పండుగ సీజన్‌లో లాంచ్ చేశాయి. అంతేకాకుండా ఆకర్షణీయమైన ఫైనాన్షింగ్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. బ్రాండ్ ప్రమోషన్‌కు, యాడ్స్ కోసం భారీగా ఖర్చు చేశాయి. ‘అన్ని కేటగిరీల్లోని ప్రొడక్ట్‌లకు డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ కెపాసిటీ ఉండే వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ప్రీమియం ప్రొడక్ట్‌లకు డిమాండ్ పెరిగింది.
ఏఐ, ఐఓటీ టెక్నాలజీతో పనిచేసే ప్రొడక్ట్‌లు కన్జూమర్లను ఆకర్షిస్తున్నాయి’ అని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ చిత్కారా అన్నారు. టైర్2, టైర్ 3 సిటీలలో కూడా ప్రీమియం ప్రొడక్ట్‌లకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ‘రానున్న వారం పండుగ సేల్స్‌లో కీలకమైనది. దంతేరాస్ టైమ్‌లో భారీగా అమ్మకాలు జరుగుతాయి’ అని వివరించారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ స్టార్టవ్వడం కూడా కలిసొస్తోంది. ‘ఈ ఏడాది వేసవిలో పెళ్లిళ్లు పెద్దగా జరగలేదు. దీంతో శీతాకాలంలో జరిగే పెళ్లిళ్ల కోసం కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి’ అని సంజయ్ వివరించారు.
ప్రీమియం ప్రొడక్ట్‌లతో పాటు మాస్ సెగ్మెంట్‌లోని ప్రొడక్ట్‌ల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయని గోద్రెజ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. కిందటేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్‌లో కంపెనీ సేల్స్ సుమారు 40 శాతం వృద్ధి చెందాయని చెప్పారు. ఈ నెలలోని దసరా, రానున్న దీపావళికి సేల్స్ 45 శాతం పైగా పెరుగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఈసారి అప్లియెన్సెస్ సేల్స్ పెరగడంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని, ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగిన సేల్స్ ఏడాది ప్రాతిపదికన 70 శాతం గ్రోత్ నమోదు చేశాయని తెలిపారు.
నవరాత్రి టైమ్‌లో సేల్స్ 20 శాతం పెరిగాయని పానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియాసు ఫుజిమొరి అన్నారు. దీపావళి టైమ్‌లో ఇదే ట్రెండ్ కనిపిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రీమియం ప్రొడక్ట్‌లకు డిమాండ్ బాగుందని చెప్పారు. 55 ఇంచులు, అంతకంటే ఎక్కువ సైజు ఉండే 75 ఇంచులు, 85 ఇంచుల సైజ్ టీవీలకు డిమాండ్ పెరిగిందని సోని ఎండీ సునిల్ నాయర్ అన్నారు. ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను, ఫైనాన్స్ స్కీమ్‌లను అందిస్తున్నామని తెలిపారు.