ఏసీ బోగీల్లోనూ ఉక్కపోతే..   రైల్వే  ప్రయాణికుల అవస్థలు అంతా ఇంతా కాదు

ఏసీ బోగీల్లోనూ ఉక్కపోతే..   రైల్వే  ప్రయాణికుల అవస్థలు అంతా ఇంతా కాదు

దక్షిణ మధ్య రైల్వేలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. బోగీలను రోజూ శుభ్రం చేయడం లేదు. పలు రైళ్లు ప్రతి రోజు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి తోడు ఏసీ బోగీల్లో ఏసీలు సరిగ్గా పనిచేయడం లేదు. ఎండాకాలంలో చల్లగా ప్రయాణం చేయడం కోసం వేలకు వేలుపెట్టి టికెట్‌ కొని ఏసీ బోగీలు ఎక్కితే.. అక్కడ కూడా ఉక్కపోతే ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు. చాలా రైళ్లలో ప్రయాణం ప్రారంభమైన తర్వాత మొక్కుబడిగా ఓ అరగంట పాటు ఏసీ వేసి ఆ తర్వాత ఆపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో ప్రస్తుతం రోజుకు 278 రైళ్లు నడుస్తున్నాయి. దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అధికారులు రైళ్ల నిర్వహణను పట్టించుకోకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎండాకాలం ముదురుతుండటంతో దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు ఏసీ కోచ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఏసీ బోగీల్లో ఉక్కపోత

రైళ్లలోని ఏసీ బోగీలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తరచూ ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నారు. మొన్న  ఎల్టీటీ ఎక్స్ ప్రెస్లో  ఈ పరిస్థితి తలెత్తడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో విశాఖ స్టేషన్లో రెండు గంటల పాటు రైలును నిలిపేశారు. సమస్య తలెత్తిన బోగీని యార్డుకు తీసుకెళ్లి మరమ్మతులు చేయించి పంపారు. తాజాగా మే 19న  తిరుమల ఎక్స్ ప్రెస్లో  ఏసీలు పనిచేయక ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. ఎలమంచిలి స్టేషన్లో రైలును ఆపి ఆందోళనకు దిగారు. తరచూ ఏసీ బోగీల్లో శీతలయంత్రాలు పనిచేయడం లేదని రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రయాణికులు వాపోతున్నారు. 

తరచూ ఎందుకీ సమస్య

ఇటీవల రైల్వేబోర్డు పలు రైళ్లలో జనరల్, స్లీపర్ బోగీలను తగ్గించి శీతల (ఏసీ) బోగీలను పెంచింది. ఏసీ  బోగీలుగా మార్చిన తర్వాత విశాఖ ఎక్స్ ప్రెస్లో  మూడు  మాత్రమే  స్లీపర్ బోగీలున్నాయి. ఏసీ బోగీలు 14కు చేరుకున్నాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్లో  5   స్లీపర్ బోగీలు , 11 ఏసీ బోగీలు  ఉన్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ లో  9 ఏసీ బోగీలు ఉండగా, 7 స్లీపర్ బోగీలు ఉన్నాయి.

రైలు ఆగితే ఏసీ బంద్

గతంలో ఐసీఎఫ్ ర్యాక్ లు ఉన్నప్పుడు ఏసీ బోగీల్లో పవర్ బ్యాటరీలను ఉపయోగించేవారు. ఆ  తర్వాత బ్యాటరీలను తొలగించారు. ఇంజిన్ సామర్థ్యంతో ఏసీ బోగీలు నడుస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రైలు వేగంగా నడుస్తున్నప్పుడే ఏసీలు పనిచేస్తున్నాయని, ఎక్కడైనా పది నిమిషాలు ఆగిందంటే పనిచేయడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఐసీఎఫ్ ర్యాక్ లు ఉన్న గరీబ్ రథ్ తదితర రైళ్లలో ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.

ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు..

ఆధునికీకరణ ఆలోచనలో ఉన్న  రైల్వే శాఖ  సాధారణ బోగీలను తగ్గించి  .. ఏసీ బోగీలు రెట్టింపు చేసింది. పవర్ కార్ బోగీలు ఉంటే ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తాయి. ప్రస్తుతం అధికశాతం రైళ్లలో ఒకటే పవర్ కారు బోగీ ఉంది. ఏసీలు సరిగా పనిచేయకపోవడానికి ఇదీ ఒక కారణమని చెబుతున్నారు. ఒక వైపు వేసవి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధిక శాతం ప్రయాణికులు ఏసీ బోగీల్లో ప్రయాణించేందుకే  మొగ్గుచూపుతున్నారు. ఆయా బోగీల్లో ఏసీలు తప్ప ఫ్యాన్లు ఉండవు. కిటీకీలు తెరవడానికి వీలుండదు. అలాంటి బోగీల్లో ఏసీలు పనిచేయకపోతే ఇక అంతే.. గాలి కూడా రాక ప్రయాణికులు  ఊపిరి ఆడక విలవిల్లాడుతున్నారు. 

దయనీయంగా ఏసీ బోగీలు

స్టేషన్లో రైలు ఆగినప్పుడల్లా ఏసీలు పనిచేయకపోవడంతో రాత్రుళ్లు నిద్ర సరిగా పట్టడం లేదని, వృద్ధులు, పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. జనరల్, స్లీపర్ బోగీలు తగ్గించి ఆదాయం పెంచుకోవడం పై ఉన్న శ్రద్ధ ఏసీ బోగీల్లో సౌకర్యాలు పెంచడంపై లేదనే విమర్శలు రైల్వేబోర్డు మూటకట్టుకుంటోంది.  ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత సమస్యకు కారణాలు విశ్లేషించి.. పరిష్కరించాల్సిన రైల్వే అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.