దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. 1.25 లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే సీటింగ్ కెపాసిటితో ఈ స్టేడియం తయారు కానున్నట్టు సమాచారం. అత్యంత గ్రాండ్ గా ఈ స్టేడియం నిర్మించాలని చూస్తుంది. ఈ స్టేడియానికి రూ.800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను దాటి నెంబర్ వన్ క్రికెట్ స్టేడియం అవ్వడం గ్యారంటీ.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమరావతిలో 60 ఎకరాల భూమిని కోరినట్లు ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రకటించారు. మీడియాతో ఇటీవల జరిగిన ఇంటరాక్షన్‌లో, అమరావతిలో 200 ఎకరాల్లో ప్లాన్ చేసిన పెద్ద స్పోర్ట్స్ సిటీలో ఈ ప్రాజెక్ట్ భాగమని చిన్ని తెలిపారు. ఇందుకు గాను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నుండి ఆర్థిక సహాయం కోరబడుతుంది.
"ఈ స్టేడియం దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను పునర్నిర్వచించడమే కాకుండా అమరావతిని ప్రపంచ క్రీడా పటంలో ఉంచుతుంది" అని కేశినేని శివనాథ్ చెప్పుకొచ్చారు. స్టేడియంతో పాటు 2029 జాతీయ క్రీడలను అమరావతిలో నిర్వహించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు యోచిస్తోంది. ఉత్తర కోస్తా ఏపీ, విజయవాడ, రాయలసీమలో మూడు ప్రత్యేక క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు శివనాథ్ వెల్లడించారు. భారత మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, రాబిన్ సింగ్ ఈ అకాడమీలలో శిక్షణను పర్యవేక్షిస్తారు.