
ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతోంది. ఇవాళ(ఏప్రిల్ 21) ఒక్క రోజే పలు ప్రాంతాల్లో నలుగురు ప్రభుత్వ ఆఫీసర్లు లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఐ, జనగామ జిల్లా చిల్పూర్ తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి,నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ పట్టుబడగా..లేటెస్ట్ గా లంచం తీసుకుంటూ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాగారం మున్సిపల్ డీఈ రఘు ఏసీబీకి దొరికాడు.
నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ దగ్గర రూ. 75 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. జనవరి 27 , 2025 నుంచి నాగారం మున్సిపాలిటీ పదవి కాలం పూర్తయింది. ఆ రోజు నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్త స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా అధికారి స్పెషల్ ఆఫీసర్ ఉన్నా.. అధికారులు లంచం తీసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.