ఏసీబీకి చిక్కిన గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో

ఏసీబీకి చిక్కిన గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో
  •   రూ.20 వేల తీసుకుంటుండగా పట్టుకున్న ఆఫీసర్లు

మహబూబాబాద్​/ కొత్తగూడ/మరిపెడ: మహబూబాబాద్ ​జిల్లాలోని కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి ఆదివారం రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వరంగల్​ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం..ఆలయ ఆవరణలో నల్లపు సాంబయ్య కొంత కాలంగా రాములు నుంచి షాపును సబ్​ లీజుకు తీసుకుని కిరాణం, కూల్ డ్రింక్ ​షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల షాపులో గుట్కాలు, మద్యం దొరకడంతో  షాపును సీజ్​ చేశారు.

ఎండోమెంట్​కమీషనర్​ఆఫీస్​లో రూ.20 వేల ఫైన్​ చెల్లిస్తే షాపు లైసెన్స్​పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే, జరిమానా కట్టే టైంలో మరో రూ.20 వేలు అదనంగా 
ఇవ్వాలని ఈవో భిక్షమాచారి డిమాండ్​ చేశాడు. దీంతో సాంబయ్య  ఏసీబీని ఆశ్రయించాడు. ఆదివారం ఆలయ ఆవరణలో రూ.20 వేలు లంచం తీసుకుంటుండుగా ఈవోను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈవో స్వగ్రామమైన మరిపెడలోని ఆయన ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సీఐ ఎల్.రాజు  మాట్లాడుతూ సోదాల్లో రూ. 70 వేల నగదు,4 గ్రాముల బంగారం,25 తులాల వెండి, కొన్ని డాక్యుమెంట్లు లభించాయని, సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజుతో పాటు ఏసీబీ సీఐ శ్యామ్​సుందర్, సిబ్బంది పాల్గొన్నారు.