
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు మొదలుకొని.. సోషల్ మీడియా పోస్టుల వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. రజినీతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు.
అవినీతి ఆరోపణలు, బెదిరింపులు తదితర అభియోగాలపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7A, ఐపీసీ 384, 120B, సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 2020 సెప్టెంబర్ లో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై విడదల రజిని మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో విడుదల రజనీని ఏ1 నిందితురాలిగా చేర్చారు అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడుదల రజిని మరిది విడుదల గోపి, ఏ4గా రజిని పీఏ రామకృష్ణలను నిందితులుగా చేర్చినట్లు తెలిపారు అధికారులు.