శంకరపట్నం, వెలుగు: నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం శనివారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, బాధితుడు కలకుంట్ల నవీన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన కలకుంట్ల నవీన్‌రావుకు 253 సర్వే నంబర్‌లో నాలుగు ఎకరాలపైగా భూమి ఉంది. ఇందులో 2.25 ఎకరాల భూమిలో పాడి గేదెల పెంపకం కోసం షెడ్ వేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు పది రోజుల కింద అప్లై చేసుకున్నాడు.
ఫీల్డ్ ఎంక్వైరీ తర్వాత ఆర్‌ఐ రిపోర్ట్ ఇవ్వడంతో ఈ నెల 23న శంకరపట్నం డిప్యూటీ తహసీల్దార్ మల్లేశంను కలిశాడు. పని పూర్తి చేసేందుకు రూ. 10 వేలు ఇవ్వాలని డీటీ డిమాండ్ చేశాడు. దీంతో నవీన్‌రావు ఏసీబీ ఆఫీసర్లను సంప్రదించాడు. వారి సూచనతో శనివారం డీటీ మల్లేశానికి రూ. 6 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు మల్లేశంను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో ఇన్స్‌పెక్టర్ పున్నం చందర్, కృష్ణకుమార్, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, శ్రీకాంత్, హోంగార్డ్ అశోక్ తిరుమలేశ్ ఉన్నారు.
స్థలం సర్వే కోసం రూ. 50 వేలు డిమాండ్
దమ్మపేట, వెలుగు: సర్వే రిపోర్టు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ సర్వేయర్ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన మద్దినేని వెంకట్ తన పొలం పాస్ బుక్స్ కోసం దమ్మపేట తహసీల్దార్ ఆఫీస్‌లో అప్లై చేసుకున్నాడు. దీంతో సర్వేయర్ వెంకటరత్నం సర్వే నిర్వహించి ఆ రిపోర్టులు తన వద్దే పెట్టుకున్నాడు.
వాటిని ఇచ్చేందుకు రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వెంకట్ రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.10 వేలు ఇచ్చాడు. తర్వాత ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో శనివారం దమ్మపేట మండల పరిధిలోని గాంధీనగర్ వద్ద సర్వేయర్‌ను కలిసి మరో రూ. 50 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సర్వేయర్ వెంకటరత్నంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, రెవెన్యూ ఆఫీస్‌కు తీసుకెళ్లారు.