- స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్
లింగంపేట, వెలుగు: ఘర్షణ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ పబ్బఅరుణ్, స్టేషన్ రైటర్ తోట రామస్వామి గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నిజామాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బాధితుల ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ నెలలో కేసు నమోదు చేశారు.
కేసులో నిందితుడిగా ఉన్నశివలింగంగౌడ్ను ఇటీవల తహసీల్దార్ ఎదుట ఎస్ఐ అరుణ్ బైండోవర్ చేశారు. గతంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు డబ్బులు తీసుకున్న ఎస్ఐ అదనంగా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం పోలీస్‌స్టేషన్‌లో రైటర్ రామస్వామికి డబ్బులు ఇవ్వగా అక్కడే కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
విచారణలో ఎస్ఐ ఆదేశాల మేరకు డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించాడు. ఎస్ఐ అరుణ్, రైటర్ రామస్వామిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇద్దరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్, వేణుకుమార్ పాల్గొన్నారు.