- నల్లా కనెక్షన్లకు రూ.30 వేలు లంచం డిమాండ్
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నుంచి తీసుకుంటూ చిక్కి.. అరెస్ట్
హైదరాబాద్/గండిపేట, వెలుగు: వాటర్ బోర్డ్ మేనేజర్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. మణికొండ నెక్నంపూర్‌కు చెందిన బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి స్థానిక వెంకటేశ్వర కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకు రెండు వాటర్ కనెక్షన్ల కోసం వాటర్ బోర్డు ఆఫీసులో దరఖాస్తు చేశాడు. కనెక్షన్లు మంజూరుకు మణికొండ వాటర్ బోర్డ్ మేనేజర్ స్పూర్తిరెడ్డి రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి.. చివరకు రూ.30 వేలకు ఒప్పుకుంది.
దీంతో ఉపేంద్రనాథ్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్‌పీ శ్రీధర్ ఆధ్వర్యంలో స్కెచ్ వేశారు. మంగళవారం మేనేజర్ స్పూర్తి రెడ్డి బాధితుడి నుంచి రూ.30 వేలు లంచం డబ్బు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ గౌడ్ ద్వారా తీసుకుంటుండగా దొరికారు. నిందితులు స్పూర్తిరెడ్డి, నవీన్‌గౌడ్‌ను అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.