శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ జిల్లాస్థాయి అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం.. కూకట్ పల్లి ఏరియా ఎల్లమ్మబండకు చెందిన కేతావత్ రమేశ్రూ.53 లక్షలతో కొనుగోలు చేసిన టిప్పర్‌కు ఎస్సీ, ఎస్టీ కోటా కింద స్కీమ్ రాయితీ వర్తింపజేయాలని అధికారులను కోరాడు. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి..
రాయితీ పొందాలంటే జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) వెంకటనర్సిరెడ్డి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు ఆయనకు రూ. 50 వేలు లంచం ఇవ్వాలని చెప్పగా.. రూ. 45 వేలకు జీడిమెట్లలోని పారిశ్రామిక ఆఫీసులో అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీంతో రమేశ్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారి సూచన మేరకు సోమవారం మేడ్చల్ కలెక్టరేట్లో వెంకట నర్సిరెడ్డికి రూ.45 వేలను రమేశ్ ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.