కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ... ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు..

రంగారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం లంచం డిమాండ్ చేస్తూ ఓ ఆర్ఐ అడ్డంగా దొరికిపోయాడు. శుక్రవారం ( జనవరి 17, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని హస్తినాపురం ఊర్మిళ నగర్ లో నివాసముంటున్న డిండి అర్ఐ శ్యామ్ నాయక్ ను తన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.దిండి మండలం పడమటి తండా కు చెందిన పాండు నాయక్ తన కూతురుకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు.

కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో ఆర్ఐ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. మొదటి విడతగా రూ. 5వేలు తీసుకున్న ఆర్ఐ రెండోసారి రూ.5వేలు తీసుకుంటుండగా..  ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 

Also Read :- మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం

శ్యామ్ నాయక్ గతంలో కూడా పీఏపల్లి ఆర్ఐగా పని చేస్తున్న సమయంలో సస్పెండ్ అయినట్టు సమాచారం. శ్యామ్ నాయక్ ఫైల్ పై సంతకం పెట్టకుండా రెండు సంవత్సరాలుగా తనను వేధిస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు శ్యామ్ నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.