- గజానికి వంద చొప్పున 1240 గజాలకు లంచం డిమాండ్
- మూడోసారి చిక్కిన సురేందర్ నాయక్
సూర్యాపేట, వెలుగు : లంచం తీసుకుంటూ సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ భానోతు సురేందర్ నాయక్, ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు సోమవారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారులకు సురేందర్ చిక్కడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అధికారుల కథనం ప్రకారం..సూర్యాపేటకు చెందిన మేక వెంకన్నకు చివ్వెంల మండలం ఐలాపురం సమీపంలో 1,240 గజాల స్థలం ఉంది. ఈయన తన బిడ్డ పేరున 1080 గజాలను గిఫ్ట్ డీడ్ తీయాలని అనుకున్నాడు.
మరో 160 గజాల స్థలాన్ని మరో వ్యక్తికి సేల్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించాడు. సంబంధిత వ్యవసాయ భూమికి నాలా పర్మిషన్ మాత్రమే ఉండి లే అవుట్ అనుమతి లేకపోవడంతో గజానికి రూ.100 చొప్పున మొత్తం1240 గజాలకు రూ.లక్షా ఇరవై నాలుగు వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.80 చొప్పున రూ.99,200 చెల్లిస్తానని సబ్ రిజిస్ట్రార్ సురేందర్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సురేందర్‌ను కలవగా ఆయన ఆఫీసు పక్కన ఉన్న డాక్యుమెంట్ రైటర్లు కల్లూరి శ్రీనివాస్, తంగెళ్ల వెంకట్ రెడ్డికి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు.
సురేందర్ చెప్పినట్టే బాధితుడు డబ్బులు ఇవ్వగా వారు క్యాష్ అందిందని సబ్ రిజిస్ట్రార్ కు చెప్పేందుకు ఆఫీసుకు వచ్చారు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ముగ్గురినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.99,200 స్వాధీనం చేసుకున్నారు. సురేందర్ 2007లో పరిగి, 2018లో మల్కాజిగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో ఏసీబీకి పట్టుబడ్డాడని నల్గొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తో పాటు హైదరాబాద్‌లోని సురేందర్ ఇంట్లో ఏక కాలంలో సోదాలు జరిపామన్నారు. రైడ్‌లో ఏసీబీ ఎస్సై రామారావు, వెంకటరావు పాల్గొన్నారు. ఏసీబీ సబ్ రిజిస్ట్రార్‌ను పట్టుకుందన్న విషయం తెలిసి చుట్టుపక్కల ఉండే డాక్యుమెంట్ రైటర్స్ షాపులు మూసేసి ఇండ్లకు వెళ్లిపోయారు.