ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఆఫీసర్లు

ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఆఫీసర్లు
  • ట్రాన్స్‌‌ఫార్మర్‌‌కు విద్యుత్‌‌ సప్లై ఇచ్చేందుకు రూ. 30 వేలు డిమాండ్‌‌
  • రెడ్‌‌హ్యాండెడ్‌‌గా దొరికిన మనోహరాబాద్‌‌ ఎలక్ట్రికల్‌‌ ఏఈ
  • ఖమ్మం జిల్లాలో రేషన్‌‌ కార్డు, ఇందిరమ్మ ఇంటి కోసం రూ. 2,500 డిమాండ్‌‌ చేసిన వార్డ్‌‌ ఆఫీసర్‌‌

మనోహరాబాద్, వెలుగు : ట్రాన్స్‌‌ఫార్మర్‌‌కు విద్యుత్‌‌ సప్లై ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌ చేసిన ఓ ఎలక్ట్రికల్‌‌ ఏఈని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మెదక్‌‌ జిల్లా మనోహరాబాద్‌‌ మండలం కాళ్లకల్‌‌ గ్రామ శివారులో ఉన్న లక్కీ ఇండస్ట్రీస్‌‌లో ఇటీవల ట్రాన్స్‌‌ఫార్మర్‌‌ను ఫిట్‌‌ చేశారు. దీనికి విద్యుత్‌‌ సప్లై ఇచ్చేందుకు ఇండస్ట్రీ నిర్వాహకులు మనోహరాబాద్‌‌ ఎలక్ట్రికల్‌‌ ఏఈ కృష్ణను సంప్రదించారు. 

దీంతో రూ.50 వేలు ఇస్తే పని పూర్తవుతుందని ఏఈ చెప్పడంతో చివరకు రూ. 30 వేలకు ఒప్పందం చేసుకొని ఈ నెల 17న రూ.10 వేలు ఇచ్చారు. మిగతా రూ. 20 వేల కోసం ఏఈ కృష్ణ ఇబ్బంది పెడుతుండడంతో ఇండస్ట్రీ నిర్వాహకులు ఏసీబీ ఆఫీసర్లను కలిశారు. వారి సూచనతో సోమవారం ఏఈ ఆఫీస్‌‌కు వచ్చి రూ. 20 వేలను ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏఈ కృష్ణను రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఏఈని అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌కు తరలించినట్లు డీఎస్పీ సుదర్శన్‌‌ చెప్పారు. దాడిలో ఇన్‌‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్‌‌ పాల్గొన్నారు. 

రేషన్‌‌ కార్డు, ఇందిరమ్మ ఇంటి కోసం...

సత్తుపల్లి, వెలుగు : రేషన్‌‌ కార్డు, ఇందిరమ్మ ఇంటి కోసం లంచం తీసుకున్న ఓ వార్డు ఆఫీసర్‌‌ ఏసీబీ ఆఫీసర్లకు చిక్కాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి రేషన్‌‌ కార్డు, ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకున్నాడు. వీటిని మంజూరు చేసేందుకు వార్డ్‌‌ ఆఫీసర్‌‌ వినోద్‌‌ రూ. 3 వేలు డిమాండ్‌‌ చేయగా, రూ. 2,500 ఒప్పందం కుదిరింది. 

తర్వాత దరఖాస్తుదారుడు ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో సోమవారం పట్టణంలోని ఓ జ్యూస్‌‌ పాయింట్‌‌ వద్ద ఉన్న వార్డ్‌‌ ఆఫీసర్‌‌ వినోద్‌‌ను కలిసి రూ. 2,500 ఇచ్చాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు వినోద్‌‌ను రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఆఫీసర్‌‌ను వరంగల్‌‌ ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామని డీఎస్పీ వై.రమేశ్‌‌ తెలిపారు.