ఏసీబీ వలలో యూబీడీ డిప్యూటీ డైరెక్టర్

ఏసీబీ వలలో యూబీడీ డిప్యూటీ డైరెక్టర్
  • రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

గచ్చిబౌలి, వెలుగు: బిల్లులు క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఏసీబీకి చిక్కాడు. చార్మినార్ జోన్​పరిధిలో మొక్కలు నాటించిన కాంట్రాక్టర్​కు రూ.44 లక్షల బిల్లులు రావాల్సి ఉంది.  శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్​గా పనిచేస్తున్న విప్పెర్ల శ్రీనివాస్ చార్మినార్​జోన్ కు ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నాడు. సదరు కాంట్రాక్టర్​బిల్లుల క్లియరెన్స్ కోసం శ్రీనివాస్ ను సంప్రదించాడు. 

అందుకు శ్రీనివాస్​కాంట్రాక్టర్ ని రూ.2.20 లక్షల లంచం డిమాండ్ చేశాడు. పలు దఫాలుగా కాంట్రాక్టర్​నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. అడిగినంత ముట్టజెప్పాల్సిందేనని శ్రీనివాస్​డిమాండ్​చేయడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్​ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం కాంట్రాక్టర్​నుంచి మిగిలిన రూ.70 వేలు తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రైడ్​చేసి రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. 

అర్బన్ బయో డైవర్సిటీ డైరెక్టర్ సునంద నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి యూబీడీ విభాగంలో తనిఖీలు చేయడంతోపాటు సిబ్బందిని ప్రశ్నించారు. ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్-2 డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 20 మంది సిబ్బందితో ఈ దాడులు జరిగాయి.