హాస్టళ్లపై ఏసీబీ నిఘా .. జిల్లావ్యాప్తంగా ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

హాస్టళ్లపై ఏసీబీ నిఘా .. జిల్లావ్యాప్తంగా ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
  • స్టూడెంట్స్ లేకుండానే దొంగ బిల్లులతో నిధులు స్వాహా
  • సంక్షేమ హాస్టళ్లలో బయటపడ్డ బాగోతాలు

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం హాస్టళ్లలో నిధులు పక్కదారి పట్టకుండా అధికారులు పటిష్ట నిఘా పెట్టారు. సంక్షేమ హాస్టళ్లలో లోపాలను గుర్తించేందుకు ఇటీవల జిల్లాలోని పలుచోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. కొంతకాలంగా సంక్షేమ హాస్టళ్లపై ఫిర్యాదులు వస్తుండడంతో ఏసీబీ అధికారులు, తూనికలు, కొలతల అధికారులు, శానిటరీ, ఫుడ్ ఇన్​స్పెక్టర్, ఆడిటర్ అధికారుల బృందంతో కలిసి ఏసీబీ డీఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 

ఈ తనిఖీల్లో కొన్ని సమస్యలను అధికారులు గుర్తించారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, మొత్తం విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టికలో నమోదు చేసిన సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉండడం, మరికొన్ని చోట్ల వార్డెన్లు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. 

విద్యార్థులు లేకుండానే బిల్లులు..  

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 87, పోస్టు మెట్రిక్ హాస్టల్స్ 23 ఉన్నాయి. ఇందులో దాదాపు 7 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 38 హాస్టళ్లు ఉండగా, ఇందులో దాదాపు 3 వేల మంది, నల్గొండ జిల్లాలో 61 హాస్టల్స్ లో దాదాపు 4,500 మంది విద్యార్థులు ఉంటున్నారు. 5వ నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ.900, 9 నుంచి 10వ తరగతి వరకు రూ.1,050, ఇంటర్ ఆపై చదువుకునే విద్యార్థుల కోసం రూ.1,500 మెస్ చార్జీలను ప్రభుత్వం అందిస్తోంది. హాస్టళ్లలో విద్యార్థుల హాజరు బయోమెట్రిక్ విధానంలో తీసుకునే అవకాశం లేకుండా మాన్యువల్ పద్ధతిలో ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వార్డెన్లు తప్పుడు లెక్కలు రాస్తున్నారు. 

ప్రతినెలా నాలుగు ఆదివారాలు, రెండో శనివారం సెలవులు ఉంటాయి. అయితే ఆయా రోజుల్లో కూడా పలు హాస్టళ్లలో వంద శాతం విద్యార్థుల అటెండెన్స్ చూపించి వార్డెన్లు నిధులు మింగేస్తున్నారు. తుంగతుర్తి సాంఘిక సంక్షేమశాఖ బాలికల హాస్టల్​లో 51 మంది బాలికలు ఉన్నట్లు రికార్డుల్లో నమోదైతే.. 25 మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ లెక్కన ఒక్కో స్టూడెంట్ కు రూ.1500 చొప్పున నెలకు రూ.45 వేలు పక్కదారి పట్టించారు. ఈ హాస్టల్ లోనే నెలకు రూ.11 లక్షల వరకు స్వాహా చేసినట్లు అధికారులు తేల్చారు. 

అందుబాటులో ఉండని వార్డెన్లు.. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని హాస్టళ్ల వార్డెన్లు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే వారికి చెప్పుకునేందుకు కూడా భయపడే పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా  బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని పలు బీసీ, ఎస్సీ హాస్టళ్లలో కొంతమంది వార్డెన్లు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తుంగతుర్తి సాంఘిక సంక్షేమశాఖ బాలికల హాస్టల్​ను ఏసీబీ అధికారులు తనిఖీ చేసే సమయంలో అక్కడ వార్డెన్ లేకపోవడం, విద్యార్థులు రాత్రి ఇంటికి పంపించడం గమనార్హం. జిల్లాలో కొన్ని హాస్టళ్లలో ఇలాగే కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

 మరిన్ని దాడులు చేస్తాం 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లలో అక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది. తుంగతుర్తి సాంఘిక సంక్షేమశాఖ బాలికల హాస్టల్​లో అక్రమాలు జరిగినట్లు గుర్తించాం. ముఖ్యంగా విద్యార్థులు లేకుండానే దొంగ బిల్లులతో నిధులు స్వాహా చేస్తున్నారు. ఇకపై జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మరిన్ని దాడులు నిర్వహిస్తాం. 

జగదీశ్ చందర్, ఏసీబీ నల్గొండ డీఎస్సీ