ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ మాజీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేరూర్ నికేశ్ కుమార్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నికేష్ లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రెండు లాకర్లు మాత్రమే నికేష్ పేరు మీద .. మిగతా 16 లాకర్స్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు గుర్తించారు. నికేష్ కుమార్ లాకర్లలో 2 కిలోల బంగారం, ప్లాటీనం డైమండ్స్ ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు.
మరో వైపు నికేష్ కుమార్ ను వారం రోజులు ఏసీబీ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అటు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు నికేష్ కుమార్ . రెండు పిటిషన్లపై డిసెంబర్ 9వ తేదీన ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏఈఈ నికేష్ కుమార్ నివాసంలో నవంబర్ 30న ఏసీబీ సోదాలు చేసింది. నికేష్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 30 చోట్ల రైడ్స్ చేశారు. ఈ సందర్భంగా నికేష్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రూ. 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాలకు అనుమలు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఏఈఈ నికేష్ కుమార్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.