హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన పోలీస్ అధికారుల అక్రమాస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమాస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు రావడంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. పంజగుట్ట పోలీసుల ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ ఆధారంగా దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కేసులో నిందితులైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ఇప్పటికే అరెస్టయిన మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుల ఆస్తుల వివరాలు సేకరించనున్నట్లు తెలిసింది.
డీజీపీకి సీనియర్ అడ్వకేట్ మోహన్ కంప్లైంట్
ఫోన్ ట్యాపింగ్‌తో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడటంతోపాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ)లాగర్ ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తులో పోలీస్ అధికారుల అక్రమాలు బయటపడ్డాయి. వ్యాపారవేత్తలు, రియల్టర్స్, హవాలా వ్యాపారులను బెదిరించి డబ్బు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారుల అక్రమ ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని సీనియర్ న్యాయవాది చలిచీమల మోహన్ మంగళవారం డీజీపీ రవిగుప్తకు ఫిర్యాదు చేశారు. వీటి ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. డీజీపీ ఆదేశాలు, పంజగుట్ట పోలీసుల కేసు దర్యాప్తు ఆధారంగా ఏసీబీ విచారణ జరిగే చాన్స్ ఉన్నట్లు తెలిసింది.
చార్జిషీట్ రిటర్న్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్
ప్రభాకర్ రావు సహా ఆరుగురు నిందితులపై పంజగుట్ట పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు తిరస్కరించింది.ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులతో పాటు పరారీలో ఉన్న ప్రభాకర్‌రావు, ఐ న్యూస్ ఎండీ శ్రవణ్‌కుమార్‌లపై ఈ నెల 11న చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో కొన్ని పొరపాట్లు ఉన్నందున కోర్టు విచారణకు స్వీకరించలేదు. పొరపాట్లను సరిచేసి మళ్లీ ఫైల్ చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వారి తరఫు లాయర్లు మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. అరెస్ట్ చేసి ఇప్పటికే 90 రోజులైనందున బెయిల్ ఇవ్వాలని కోరగా, వారి పిటిషన్‌ను గురువారం డిస్మిస్ చేసింది.