ముహూర్తం ఫిక్స్ అయ్యింది: కేటీఆర్ను విచారించేందుకు ACB స్పెషల్ టీం

ముహూర్తం ఫిక్స్ అయ్యింది: కేటీఆర్ను విచారించేందుకు ACB స్పెషల్ టీం

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ A1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నమోదైన సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనవి. ఈ క్రమంలోనే.. కేటీఆర్ను విచారించేందుకు.. అందుకు కావాల్సిన ఏర్పాట్లపై ACB DG విజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు. 2024, డిసెంబర్ 19వ తేదీ సాయంత్రం.. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసు విచారించేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారాయన.

ఈ కేసులో కేటీఆర్ A1 కావటంతో.. మొదటగా ఆయననే విచారించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు సిద్ధం అవుతున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది.

ఈ కేసులో కేటీఆర్ పేరును ఏ1గా ఏసీబీ చేర్చింది. ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డి పేరును ఏసీబీ చేర్చింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13(1)A, 13(2) కేసులు నమోదు చేశారు. 409, 120B సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది. 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులే కావడం గమనార్హం.

ఫార్ములా ఈ–రేస్‎కు బరాబర్​పైసలిచ్చామని, తానే సంతకం పెట్టానని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్​బ్రాండ్​ ఇమేజ్‎ను పెంచేందుకు నాడు ప్రభుత్వ కార్యక్రమంగా రూ.55 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ‘‘పైసలు రిలీజ్​ చేయాలని అప్పటి మున్సిపల్​శాఖ కార్యదర్శి అర్వింద్​కుమార్‎కు నేనే చెప్పిన. ఆర్డర్స్​పై సంతకం కూడా పెట్టిన. ఫార్ములా ఈ–రేస్‎కు డబ్బులు రిలీజ్​ చేసిన విషయంలో పూర్తి బాధ్యత నాదే. అర్వింద్ ​తప్పు లేదు. అప్పుడు నేనే గవర్నమెంట్. ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్న” అని ఆయన ఇప్పటికే చెప్పారు.