![ఆర్టీఏలో అలజడి.. డీటీసీ శ్రీనివాస్‌పై విచారణతో డిపార్ట్మెంట్ లో కలకలం](https://static.v6velugu.com/uploads/2025/02/acb-has-already-raided-two-senior-officers-combined-warangal-district_SW1wZKdAG0.jpg)
- ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఇద్దరు పెద్దాఫీసర్లపై ఏసీబీ దాడులు
- ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని నిర్ధారణ
- మరికొందరిపైనా అవినీతి ఆరోపణలు
- ఏసీబీ సోదాలతో కరప్టెడ్ ఆఫీసర్లలో గుబులు
హనుమకొండ, వెలుగు: ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్ల అవినీతికి అంతులేకుండా పోతోంది. ఆఫీసులను అడ్డాగా చేసుకుని కొందరు అధికారులు కరప్షన్‌కు పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కూడగడుతున్నారు. కొద్దిరోజుల కిందట మహబూబాబాద్డీటీవో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కాగా, తాజాగా డీటీసీ పుప్పాల శ్రీనివాస్ కూడా పెద్ద మొత్తంలో ఆస్తులు పోగేసినట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. దీంతో రవాణా శాఖలో అలజడి మొదలవగా, మరికొందరు ఆఫీసర్లపైనా ఇవే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు పెద్దాఫీసర్లు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అవడంతో ఉమ్మడి జిల్లాలోని మరికొందరు కరప్టెడ్ ఆఫీసర్లలో గుబులు మొదలైంది.
పనిని బట్టి వసూళ్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీఏ ఆఫీసులు అవినీతికి అడ్డాగా మారాయి. కొంతమంది ఆఫీసర్లు ప్రైవేటు ఏజెంట్లను నియమించుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. వెహికల్ ఫిట్నెస్ టెస్టుల నుంచి మొదలు లర్నింగ్ లైసెన్స్, రిన్యూవల్స్, బండ్ల రిజిస్ట్రేషన్, ఎక్స్టెన్షన్.. ఇలా ఆఫీస్‌లో జరిగే ప్రతి పనికీ ఏజెంట్ల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. తెర వెనుక ఆఫీసర్లే ఉండి నడిపిస్తుండటంతో కొంతమంది ఏజెంట్లు నకిలీ ఇన్సూరెన్స్‌లు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల దందాకు కూడా తెరలేపారు.
ఈ నేపథ్యంలోనే గతేడాది ఫిబ్రవరి 9న వరంగల్, హనుమకొండ ఆర్టీఏ ఆఫీస్‌ల వద్ద ఫేక్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల దందాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వెనుక కూడా ఆర్టీఏ పెద్దాఫీసర్లే ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇలా ఆఫీస్‌లో జరిగే ప్రతి పనికీ కమీషన్లు తీసుకోవడంతోపాటు పనిని బట్టి రేట్లు ఫిక్స్చేస్తూ ఆఫీసర్లు అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు..
ఆర్టీఏ డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్లు అక్రమంగా రూ.కోట్లు వెనకేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ వ్యవహారంలోనూ ఇదే వెల్లడైంది. ఆయనపై ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరున మూడు ఇండ్లు, 16 ఓపెన్ ప్లాట్లు, 15.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ రూ.3 కోట్లు. కానీ, బయట మార్కెట్రేట్ప్రకారం రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
దాంతోపాటు రూ.22.8 లక్షల విలువైన గృహోపకరణాలు, 1542 గ్రాముల గోల్డ్, 400 గ్రాముల వెండి గుర్తించారు. 23 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ఉన్నట్లు నిర్ధారించగా, దాని ప్రకారం ఆయనపై ఎక్సైజ్ కూడా నమోదు కావడం గమనార్హం. ఇదిలాఉంటే గత మే 28న మహబూబాబాద్ డీటీవో ఆఫీస్‌లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో డీటీవో గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావు, మరో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.61,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు జరిపి ఏజెంట్ల ద్వారా రూ.2.97 కోట్లు వసూళ్లకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.
అక్రమార్కుల్లో గుబులు..
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో అక్రమాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలున్నాయి. దీంతోనే ఏసీబీ అధికారులు ఆర్టీఏపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఇద్దరు పెద్దాఫీసర్లను అరెస్ట్ చేసి, పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు నిర్ధారించారు. దీంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మరికొందరు ఆఫీసర్లలో గుబులుమొదలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆఫీసర్ల జాబితా ఇప్పటికే ఏసీబీ అధికారుల చేతిలో ఉండగా, వారందరిలో టెన్షన్ నెలకొంది. కాగా, ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్తే ఏజెంట్, పైసా లేనిదే పని జరగదన్న ప్రచారం ఉండగా, అక్రమార్కుల భరతం పట్టి ఆర్టీఏ వ్యవస్థను చక్కదిద్దాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.